ఫ్లాప్ అవ్వుద్దని తెలిసీ రిలీజ్ చేశారా.?

మా సినిమా చాలా చాలా బావుంటుంది.. అని చెప్పుకోని దర్శక నిర్మాతలు, నటీనటులెవరైనా వుంటారా.? ఛాన్సే లేదు. ‘బుట్టబొమ్మ’ విషయంలో కూడా పబ్లిసిటీ విపరీతంగా జరిగింది. కానీ, సినిమా థియేటర్లలో తేలిపోయింది.

అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. సితార సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. పబ్లిసిటీ పరంగా చూసుకుంటే, గట్టిగానే కష్టపడ్డారాయె.!

కానీ, థియేటర్లలో ఒక్కరోజు కూడా సినిమా నిలబడలేకపోయింది. మలయాళ సినిమా ‘కప్పెల’ని తెలుగులోకి ‘బుట్టబొమ్మ’ పేరుతో రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో ఈ సినిమా తీయాలనుకున్నారట.

తీరిగ్గా ఈ సినిమా పరాజయంపై నిర్మాత స్పందించారు. కోవిడ్ దెబ్బ వల్లే సినిమా ‘పాతబడిపోయింది’ అన్నది నిర్మాత వాదన. అన్నీ తెలిసి, జనం నెత్తిన సినిమాని బలంగా ఎందుకు రుద్దారో మరి.! నేరుగా ఓటీటీకి ఇచ్చేసుకున్నా.. థియేటర్లకు వెళ్ళిన ఆ కొద్ది మంది ప్రేక్షకులకి తలనొప్పి తగ్గేదే.!