అనసూయ సినిమా ‘అరి’కి డిమాండ్‌!

సినిమాలో కంటెంట్‌ ఉంటే చాలు.. అది తక్కువ బడ్జెట్‌ చిత్రమైనా కూడా దానిని రీమేక్‌ చేయడానికి ఇతర భాషల స్టార్లు ముందుకు వస్తారు. ప్రస్తుతం అనసూయ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రానికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. యాంకర్‌ నుండి యాక్టర్‌గా మారిన అనసూయ చేతిలో పలు సినిమాలు ఉండగా.. అందులో ‘అరి’కూడా ఒకటి.

ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుండి దీని రీమేక్‌ కోసం పోటీ మొదలయ్యిందని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే దీని రీమేక్‌ రైట్స్‌ కోసం ఒక బాలీవుడ్‌ స్టార్‌ లైన్‌లో ఉండగా.. తాజాగా ఒక కోలీవుడ్‌ హీరో కూడా ఇందులో యాడ్‌ అయ్యాడని సమాచారం. కొత్త రకం కాన్సెప్ట్‌తో ‘అరి’ తెరకెక్కింది. ఈ సినిమాలో వినోద్‌ వర్మ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు.

మనుషుల్లో ఉండే లోతైన కోరికలను తీర్చే పాత్రలో వినోద్‌ వర్మ కనిపించనున్నాడు. ఇక కోరికలు తీరాలి అనుకునేవారు ఒక్కొక్కరుగా వచ్చి తనకు చెప్పుకుంటారు. అదే సమయంలో వారందరి చేత నేరాలకు పాల్పడేలా చేస్తాడు వినోద్‌ వర్మ. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా మలుపులు తిరుగుతాయి అనేది మిగిలిన కథ.

అలా కోరిక తీరడం కోసం తన వద్దకు వచ్చే ఒక పాత్రలో అనసూయ భరద్వాజ్‌ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అవ్వగా.. మూవీ రిలీజ్‌కు మాత్రం సమయం పడుతుంది. ఇంతలోనే ‘అరి’ రీమేక్‌ గురించి టాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి.