Anasuya Bharadwaj: నోరుంది కదా అని వేదికలపై మైకుపట్టుకుని ఏది బడితే అది మాట్లాడితే ఆన్ లైన్ వేదికగా గూబలు గుయ్య్ మనిపించే రోజులు ఇవి. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే వారూ వీరూ అనే తేడా లేకుండా మూకుమ్మడి దాడి కన్ ఫాం. ఈ విషయం తాజాగా శివాజీకి అర్ధమైనట్లుంది. తాజాగా ఆయన హిరోయిన్స్ దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై పేరు ఎత్తకుండానే అనసూయ ఇచ్చి పడేశారు! ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇటీవల కాలంలో వయసు పెరిగినా బుద్ది పెరగని చాలా మంది నటుల జాబితాలో శివాజీ కూడా చేరినట్లేనా..?
పైకి పేరు చెప్పలేదు కానీ.. అనసూయ చేసిన పోస్టులు శివాజీని ఉద్దేశించే అనే శివాజీ మస్తిష్కానికి అర్ధమైందా..?
ఎదిగే కొద్దీ.. పోనీ వయసు పెరిగే కొద్దీ ఒదగాలి తప్ప వదులవ్వకూడదు అనే విషయం శివాజీకి ఇప్పటికైనా అవగతమైందా..?
ఇటీవల జరిగిన “దండోరా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. హీరోయిన్లు “సామాన్లు” కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ్లామర్ ఎక్కువ వద్దని.. ప్రతి దానికి లిమిట్ ఉండాలని చెప్పారు. ఆ సమయంలో కొన్ని డ్రెస్సులు చూశాక.. లోపల దరిద్ర %$#@, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అనిపిస్తుందని అన్నారు. ఆ వ్యాఖ్యలే తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఇలా.. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, సంప్రదాయం అంటే ఏంటి అనే అంశాలపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించగా, ఇప్పుడు ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. శివాజీ పేరు ఎత్తకుండానే ఆయన నోరు ఎత్తకుండా అన్నట్లుగా ఇచ్చి పడేశారు. ఇంతకూ అనసూయ ఏమన్నారో ఇప్పుడు చూద్దామ్..!
తాజాగా చేసిన పోస్టులో అనసూయ… ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. ఆమె వేసుకునే బట్టలు ఎవరినీ ఉద్దేశించి వేసుకునేవి కావని.. దానివల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదని స్పష్టం చేశారు. అంటే.. వేసుకునే దుస్తుల్లో తప్పు లేదని, చూసే వాళ్ల చూపులోనే సమస్య ఉందని ఆమె చెప్పకనే చెప్పారనమ్మట.
ఇదే సమయంలో.. అసలు సమస్య ఎక్కడుందంటే.. “ఎదుటివారి బట్టల గురించి చేసే కామెంట్స్, చూసే చూపులు, అడగకుండా ఇచ్చే ఉచిత సలహాలు.. ఇవే ఎదుటివారిపై ప్రభావం చూపిస్తాయి తప్ప బట్టలు కాదు” అని అనసూయ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఇదే క్రమంలో… మోరల్ పోలీసింగ్ గురించి మాట్లాడుతూ.. మనలోని అభద్రతా భావాన్ని ఇలా మోరల్ పోలీసింగ్ గా మార్చడం వల్ల అది మగతనం అనిపించుకోదని.. రక్షణ కల్పించడం అసలే కాదని.. అది కేవలం ఎదుటివారిని కంట్రోల్ చేయడమే అవుతుందని.. గౌరవం అనేది ఒకరు పర్యవేక్షిస్తే వచ్చేది కాదని అనసూయ కుండబద్దలు కొట్టారు.

ఈ క్రమంలోనే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ ఓ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ తో తన పోస్ట్ ను ముగించారు అనసూయ. ఇందులో భాగంగా… ఇతరులను కంట్రోల్ చేయడం అనేది బలం ముసుగులో ఉన్న బలహీనత మాత్రమేనని.. ఎదుటివారిని గౌరవించడమే నిజమైన బలం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు.. శివాజీకి ఇంతకంటే క్లియర్ గా, స్ట్రాంగ్ గా ఎవరు చెప్పగలరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఏది ఏమైనా.. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటారనే పేరు సంపాదించుకున్నారనే కామెట్స్ సంపాదించుకున్న శివాజీకి తాజా ఎపిసోడ్ ఓ గొప్ప పాఠమని అంటున్నారు పరిశీలకులు. దీంతో.. ఇకపై రాజకీయ నాయకులపై అయినా, సినిమాలపై అయినా.. వ్యక్తులపై అయినా, వ్యక్తిత్వాలపై అయినా, వస్త్రధారణపై అయినా… ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

