ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొంది, ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న విడుదలైన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఎంచుకున్న అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం. ఈ చిత్రంలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ వంటి భారీ తారాగణం నటించింది. మరి ఈ మూవీ కథలోకి ఓ సారి వెళ్దాం..
కథాబలం : అంతర్గత శత్రువులు, విచిత్ర కోరికలు సినిమా కథాంశం మానవుడిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం) చుట్టూ తిరుగుతుంది.
ఈ ఆరు ఎమోషన్స్‌కు ప్రతీకగా, ఆరు విభిన్న పాత్రలు తమ వింత కోరికలతో పరిచయమవుతాయి. సన్నీ లియోన్‌తో రాత్రి గడపాలని కోరుకునే అమూల్ (వైవా హర్ష) నుండి, చనిపోయిన భర్తను తిరిగి రప్పించాలని కోరుకునే లక్ష్మీ (సురభి ప్రభావతి) వరకు ప్రతి కోరిక ఆసక్తికరంగా ఉంటుంది.
‘ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును’ అనే ప్రకటన చూసి, ఈ ఆరుగురూ తమ కోరికలు తీర్చుకునేందుకు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు.
ఆ కోరికలు తీర్చే వ్యక్తి ఎవరు? ఆయన ఆ ఆరుగురికి ఎలాంటి టాస్కులు ఇచ్చారు? మనిషి తన కోరికలను తీర్చుకోవడం కోసం ఎంతవరకు త్యాగం చేయగలడు? ఈ అరిషడ్వర్గాలను ఎలా జయించాలి? అన్నదే సినిమా యొక్క ప్రధాన సారాంశం.
నటన, విశ్లేషణ : సందేశాత్మక చిత్రం ప్రథమార్థం పాత్రల పరిచయాలు, వారి కోరికల చిట్టాలతో పాటు చతుర, వితుర పాత్రల ద్వారా హాస్యాన్ని పంచుతూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథనానికి అసలు మలుపునిస్తుంది.
ద్వితీయార్థంలోనే దర్శకుడు తన ఏడేళ్ల పరిశోధనను తెరపైకి తీసుకొస్తాడు. ఆ ఆరు పాత్రల్లో వచ్చే భావోద్వేగ మార్పును, వారు నిస్వార్థంగా మారే పరిణామక్రమాన్ని దర్శకుడు జయ శంకర్ మెప్పించేలా చూపించారు. దర్శకుడు చెప్పాలనుకున్న సమాజ సందేశం ఎక్కడా ‘క్లాస్’ పీకుతున్నట్లు కాకుండా, సున్నితంగా ప్రేక్షకుడి మనసును తాకుతుంది.
ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత బలంగా నిలిచాయి. ఇవి ప్రేక్షకుడికి తప్పకుండా గూస్ బంప్స్‌ను ఇస్తాయి. ‘ఒక మంచి సినిమా చూశామనే’ సంతృప్తితో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ అన్ని భాషలకు అనుకూలమైంది. ఇతర భాషల్లోనూ రీమేక్ చేసినా అందరికీ కనెక్ట్ అవుతుంది.
నటీనటులలో, వినోద్ వర్మ నటన హైలెట్‌గా నిలిచింది. సాయి కుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సహా అందరూ తమ పాత్రలకు బలం చేకూర్చారు.
సాంకేతికత & ముగింపు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం మరియు ఆర్.ఆర్. సినిమాకు ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. లిమిటెడ్ బడ్జెట్‌లో కూడా వీఎఫ్ఎక్స్ క్వాలిటీ మెచ్చుకోదగిన విధంగా ఉంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని ధైర్యంగా నిర్మించిన నిర్మాతల కృషి ప్రశంసనీయం.
తీర్పు: అరిషడ్వర్గాలు అనే లోతైన అంశాన్ని టచ్ చేస్తూ, సమాజానికి గొప్ప సందేశాన్ని అందించిన చిత్రం ‘అరి’. ఇలాంటి వినూత్న చిత్రాలను ప్రోత్సహించదలుచుకున్న ప్రేక్షకులు తప్పకుండా చూడవచ్చు.
రేటింగ్ 3
