ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు మెరుపు మెరిపించింది. వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో గెలిచి ట్రాక్ లోకి వచ్చేసింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగినా, చివరి ఓవర్ రనౌట్స్ ఢిల్లీకి భారీ షాక్ ఇచ్చాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
తిలక్ వర్మ 33 బంతుల్లో 59 (6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రికెల్టన్ 41 (25 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్ 40 (28 బంతుల్లో), నమన్ ధీర్ 38 నాటౌట్ (17 బంతుల్లో) తో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2/23, విప్రజ్ నిగమ్ 2/41 వికెట్లు తీశారు. అనంతరం ఛేజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు (12 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా గెలుపు అందుకోలేకపోయాడు.
అభిషేక్ పోరెల్ 33 (25 బంతుల్లో) చేయగా మిగతావారు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3/36, సాంట్నర్ 2/34 కీలక వికెట్లు తీశారు. తిరుగు లేని మలుపు బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో చోటుచేసుకుంది. తొలి మూడు బంతుల్లో రెండు బౌండరీలు బాదిన అషుతోష్ శర్మ, నాలుగో బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ కూడా వరుసగా రనౌటై ఢిల్లీ ఓటమికి కారణమయ్యారు. ఒక్క ఓవర్‌లో హ్యాట్రిక్ రనౌట్స్ ఈ మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేశాయి. ఒక దశలో గెలుపు దగ్గరగా కనిపించిన ఢిల్లీ, చివరికి చేతికొచ్చిన మ్యాచ్ సునాయాసంగా చేజార్చుకుంది.