ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి విజయం సాధించింది. బుధవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. లక్ష్యంగా నిర్ధేశించిన 164 పరుగులను కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ విజయానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ సెంచరికి సమానమైన ఇన్నింగ్స్. 53 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రాహుల్, బెంగళూరు ఆశలను పూర్తిగా తుడిచేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మంచి ఆరంభం అందుకుంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (37), విరాట్ కోహ్లీ (22) పరుగులు చేసి జట్టుకు వేగం అందించారు. మధ్యలో రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (37*), రెండు ఫోర్లు, నాలుగు సిక్సులతో బరిలో పుంజుకొని స్కోరును 163 వరకూ చేర్చారు. ఢిల్లీ తరఫున కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ పరుగుల వేగాన్ని కట్టడి చేశారు.
లక్ష్యచేధనలో ఢిల్లీ తొలి నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయినా.. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో మ్యాచ్‌ను దిశా మళ్లించాడు. 7 ఫోర్లు, 6 సిక్సులతో దంచికొట్టిన రాహుల్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్ (38*) కూడా విజయాన్ని భరోసాగా నిలబెట్టాడు. 13 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని చేరుకుంది. చెత్త ఆరంభం అయినా.. రాహుల్ ధాటికి ఆర్సీబీ పూర్తిగా గుల్లయింది.
కేఎల్ రాహుల్ ఇలా ఆడతాడా? అన్నట్టు తన క్లాస్ బ్యాటింగ్‌తో ఢిల్లీకి చక్కటి విజయాన్ని అందించాడు. కెప్టెన్ అక్షర్ ప్రోత్సాహంతో జట్టు నిండుగా ఆడుతోంది. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో టాప్ 2లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లే ఆఫ్స్‌కు బలంగా దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ విజయంలో కీలకంగా నిలిచిన రాహుల్ ఇన్నింగ్స్‌ను అభిమానులు ‘అన్‌ఆఫిషియల్ సెంచరీ’గా గర్వంగా చెప్పుకుంటున్నారు.
