జెర్సీ కి నేషనల్ అవార్డు…నానికి ట్రాఫిక్ పోలీసుల పంచ్

సోషల్‌‌మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయాన్నైనా ప్రపంచంతో పంచుకోవడం సర్వసాధారణమైపోయింది. స్మార్ట్‌ఫోన్ యుగంలో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లోనే ఆ వీడియో, ఫోటోలు ఆన్‌లైన్లో ప్రత్యక్షమైపోతున్నాయి. అయితే సోషల్‌మీడియాను కొందరు దుర్వినియోగపరుస్తుంటే.. పోలీసులు మాత్రం ప్రజలకు దగ్గరయ్యేందుకు దాన్ని సాధనంగా వాడుకుంటున్నారు.

Images

ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు ఈ విషయంలో అందరికంటే వంద అడుగులు ముందే ఉన్నారు. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూనే వాటిని వాహనదారులకు అన్వయిస్తూ మేమ్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం సినీ తారలను వాడేస్తున్నారు. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు గారు.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం ఉండదు’ అంటూ సైబరాబాద్‌ పోలీసులు చేసిన ఫన్నీ పోస్ట్ వైరల్‌ అయింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ఫోటోను షేర్ చేశారు.

జెర్సీ సినిమాలో నాని బైక్ నడుపుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు. సినిమాలో నాని కొడుకు ‘నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న .. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో’ అనే డైలాగ్ రాశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌‌మీడియాలో వైరల్ అవుతుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.