చిత్ర బృందంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. ఆగిపోయిన చిత్ర షూటింగ్

కరోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న దాదాపు ఏడెనిమిది నెల‌ల‌పాటు ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్నాయి. అయితే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా బెడ‌ద మాత్రం త‌ప్ప‌డం లేదు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాకు సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ క‌రోనా బారిన ప‌డ‌డంతో ఈ చిత్ర యూనిట్‌కు బ్రేక్ ప‌డ్డ‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ షూటింగ్ కూడా క‌రోనా వ‌ల‌న ఆగిన‌ట్టు తెలుస్తుంది.

జగ్ జగ్ జీయో చిత్రం కొద్ది రోజులుగా చంఢీఘ‌ర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల మ‌ధ్య ముఖ్య‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు మేక‌ర్స్ .అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వ‌రుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు క‌రోనా సోకింద‌ని, దీని వ‌ల‌న చిత్ర షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ వేసిన‌ట్టు స‌మాచారం. అయితే మూవీ టీం అనీల్ క‌పూర్‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌చారం జ‌రిగినప్ప‌టికీ,
కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వ‌చ్చింద‌ట‌. మ‌రి దీనిపై చిత్ర బృందం నుండి ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌కట‌న అయితే రాలేదు.

దివంగ‌త న‌టుడు రిషీ క‌పూర్ స‌తీమ‌ణి నీతూ క‌పూర్ న‌టి అన్న సంగ‌తి తెలిసిందే. రిషీ మ‌ర‌ణం త‌ర్వాత ఆమె న‌టిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో నీతూ క‌పూర్ ..‘‘ కపూర్‌ సార్‌ నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పడానికి మీరిక్కిడ లేరు…అయినా నిత్యం నాతోనే ’’ అంటూ కామెంట్ పెట్టింది. జ‌గ్ జ‌గ్ జీయో చిత్రం క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో నిర్మితమ‌వుతుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ ఆ మ‌ధ్య విడుద‌లైంది. ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.