అతడి మరణం తట్టుకోలేకపోయా : యాంకర్‌, నటి ఝాన్సీ

ప్రముఖ యాంకర్‌, నటి ఝాన్సీ అందరికీ పరిచయస్తురాలు. ఆమె టీవీ వ్యాఖ్యాతగా, చాలా తెలుగు చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటుకున్నారు. అలాగే సామజిక సమస్యల విూద కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ విూద జరిగే ఎటువంటి దాడి అయినా ఆమె ఖండిస్తూ వుంటారు. అటువంటి ఝాన్సీ ఇప్పుడు చాలా ఆవేదనకు గురయ్యారు.

తన తమ్ముడు లాంటి శ్రీను, తన వ్యక్తిగత కార్యదర్శి కూడా అయిన అతను ఈరోజు గుండెపోటు వచ్చి మరణించాడు. అందుకు ఝాన్సీ ఎంతో ఆవేదనతో అతని గురించి తన సాంఫీుక మాధ్యమం అయిన ఇన్స్టాగ్రామ్‌ లో ఒక పోస్ట్‌ పెట్టారు. ”శ్రీను, శ్రీనుబాబు అని నేను ముద్దుగా పిలుచుకునే నా ప్రధాన సపోర్ట్‌ సిస్టమ్‌. హెయిర్‌ స్టైలిస్ట్‌గా అతను నా దగ్గర చిన్నగా ప్రారంభించి, తరువాత నా వ్యక్తిగత కార్యదర్శిగా ఎదిగాడు. అంతే కాకుండా నా పనులన్నీ చూసుకోవటమే కాకుండా, చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను ఉంటే చాలు నాకు ఎంతో ఉపశమనం, అతనే నా బలం కూడాను. అతను చాలా సౌమ్యుడు, మంచివాడు, నిజాయితీపరుడు, అప్పుడప్పుడూ చమత్కారమైన హాస్యం కూడా మాట్లాడుతాడు.

అతను నాకు అన్నిటికంటే ఎక్కువ, నాకు నా కుటుంబానికి అతను సొంత తమ్ముడుగా భావిస్తూ వుంటాను. 35 సంవత్సరాల వయస్సులో, కార్డియాక్‌ అరెస్టు తో ఈ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు’’ అని ఒక భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు ఝాన్సీ. నేను అతని మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను, నా గుండె బద్దలైంది అంటూ జీవితం నీటి బుడగలాంటిది అని వ్యాఖ్యానించారు ఝాన్సీ.