ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం, శ్రమకి తగిన గుర్తింపు రాకపోవడం ఈ కాలంలో చాలా మందికి ఎదురవుతున్న సమస్య. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ.. జీవితంలో ఎదగాలనే తపన ఉన్నా అదృష్టం అడ్డుపడినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో శ్రమను ఫలితంగా మలచేందుకు కొన్ని పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయని పరిహార శాస్త్రం చెబుతోంది. ఇవి కేవలం భక్తి లేదా నమ్మకానికి మాత్రమే కాదు.. మనసులోని నెగెటివ్ ఎనర్జీని తగ్గించి, కర్మ ఫలితాలను సానుకూలంగా మార్చే ఆధ్యాత్మిక చిహ్నాలు.
ముందుగా ఇంటి వాతావరణంలోనే పాజిటివ్ ఎనర్జీని పెంచడం ముఖ్యం. హాల్‌లో క్షీర సాగర మదనం ఫోటో ఏర్పాటు చేసుకోవడం ఆధ్యాత్మికంగా శుభప్రదమని భావిస్తారు. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలకడం ధనసంపద, విజయాలను సూచించే సంకేతం. ప్రతి రోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆ ఫోటోకు నమస్కారం చేస్తే కష్టానికి తగిన ఫలితాలు త్వరగా లభిస్తాయని నమ్మకం.
ఇంట్లో పూజా గదిలో స్పటిక లింగాన్ని ఏర్పాటు చేసి బిల్వదళాలతో పూజించడం మరో శక్తివంతమైన పరిహారం. ఇలా చేసే వారి ఇంటికి ఆధ్యాత్మిక శక్తులు చేరి అదృష్టాన్ని ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక పూజా పద్ధతులతో పాటు మంత్రపఠనం కూడా ఎంతో శక్తివంతమైంది. భక్తి భావంతో 40 రోజుల పాటు “భ్రమరాంబ అష్టకం” చదివితే అడ్డంకులు తొలగి ఫలితాలు వేగంగా రావడం సాధ్యమవుతుందని విశ్వసిస్తారు.
ఇంకా ప్రత్యేకంగా శివారాధన చేయడం కూడా అత్యంత శుభప్రదం. ప్రతి సోమవారం ఆవు నెయ్యితో చేసిన బెల్లం పొంగలి శివాలయంలో భక్తులకు పంచిపెట్టడం చాలా శక్తివంతమైన పరిహారం. పంచదార, నూనె, ఎండు మిరపకాయలు వాడకూడదని పరిహారం శాస్త్రం స్పష్టం చేస్తోంది. నెయ్యి, బెల్లం, పచ్చి మిరపకాయలతో చేసిన నైవేద్యం పవిత్రతను పెంచి కర్మ ఫలితాల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతారు.
జన్మ నక్షత్రం రోజున పచ్చి మిరపకాయలతో పులిహోర తయారు చేసి దేవాలయ ప్రాంగణంలో పంచడం మరో పవిత్ర పరిహారం. ఇలాచేస్తే కష్టానికి తగ్గ ఫలితాలు త్వరగా దక్కుతాయని విశ్వాసం. అదేవిధంగా ఆ రోజున శనగలు దానం చేయడం లేదా పంచిపెట్టడం వల్ల కర్మ దోషాలు తగ్గుతాయని చెబుతారు. ఇంకా ఒక ఆసక్తికరమైన పరిహారం తీర్థయాత్రలతో అనుబంధమైంది. పవిత్ర యాత్రలకు వెళ్లి వచ్చిన వారి దగ్గరకు వెళ్లి వారికి పసుపు రంగులో ఉన్న పండ్లు ఇవ్వడం ద్వారా వారి పుణ్యఫలం లో కొంత భాగం మీకు వస్తుందని నమ్మకం. దీని వల్ల అదృష్టం త్వరగా తలుపు తడుతుందని పరిహార శాస్త్రం చెబుతోంది.
శుక్రవారం తులసి కోట దగ్గర దీపం పెట్టడం, ఉసిరికాయపై ఆవు నెయ్యి వత్తులు వెలిగించడం ఆధ్యాత్మికంగా చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక మరియు వృత్తి సంబంధిత ఎదుగుదలకు దోహదం చేస్తుందని విశ్వాసం. ఈ పరిహారాలు విశ్వాసంతో, భక్తితో చేయడం ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. కేవలం పనిగా కాకుండా మనసు నిండా ఆచరిస్తేనే శక్తి దానిలో ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం రాకపోవడం అనేది శాశ్వత సమస్య కాదు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నాలు జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటాయి. అదృష్టం తలుపు తట్టాలంటే మీరు ప్రయత్నించాల్సింది కేవలం ఒక అడుగు మాత్రమే. (గమనిక: ఈ కథనం పండితులు చెప్పిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు)
