హిందూ ధర్మంలో సూర్యారాధనకు అత్యంత పవిత్రమైన దినంగా రథసప్తమిని భావిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజున జరుపుకునే ఈ పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం ఈ రోజునే సూర్యభగవానుడు అవతరించినట్టు విశ్వాసం. అందుకే రథసప్తమి నాడు చేసే ప్రతి పూజ, దానం, స్నానం సాధారణ రోజులతో పోలిస్తే వెయ్యిరెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
రథసప్తమి రోజు ఉదయాన్నే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. స్నానం చేసే సమయంలో తలపై జిల్లేడు ఆకులు ఉంచుకోవడం విశేషం. సూర్యభగవానునికి జిల్లేడు అత్యంత ప్రీతికరమని, ఈ విధంగా స్నానం చేయడం వల్ల గత జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అనంతరం సూర్యరశ్మి తాకే ప్రదేశంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
ఇంటి ముందు రథం ఆకారంలో ముగ్గు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం రథసప్తమి ప్రత్యేకత. ఎర్రటి వస్త్రాలు ధరించి, రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కుంకుమ, అక్షతలు, ఎర్ర పువ్వులు వేసి అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీటి ధార గుండా సూర్యుడిని దర్శించటం ద్వారా సూర్య దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ సమయంలో నీరు కాళ్లపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలని శాస్త్ర సూచన.
సంతాన ప్రాప్తి, ధన లాభం కోరుకునే వారు ఈ రోజున చిక్కుడు కాయలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఏడు జిల్లేడు ఆకులతో సూర్యుని పూజించిన వారికి ఏడు జన్మల పాపాలు నశించి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. సూర్య అష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుందని విశ్వాసం.
రథసప్తమి రోజున గోధుమలు, బెల్లం వంటి వాటిని దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుందని శాస్త్రోక్తం. ఈ ఏడాది భానుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం రోజున రథసప్తమి రావడం విశేషంగా భావిస్తున్నారు. అందుకే ఈ సప్తమిని ‘భాను సప్తమి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున చేసే స్నానం గంగానదిలో వెయ్యిసార్లు స్నానం చేసిన పుణ్యానికి సమానమని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
స్నానం చేసే సమయంలో “సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన” అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ఇంటి గుమ్మం వద్ద పసుపు–కుంకుమలతో అలంకరించిన రాగి నాణెం ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమై, ఇంట్లో శుభశక్తి ప్రవేశిస్తుందని భక్తులు నమ్ముతున్నారు. భక్తి, శ్రద్ధతో రథసప్తమి పూజలు నిర్వహిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగి, సూర్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పండితుల అభిప్రాయం.
