ఆచార్య : స్ట‌న్నింగ్ లుక్ లో చిరంజీవి, చరణ్..వీడియో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు కూడా. ఈ సినిమాను మే 13న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకురావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. దీంతో షూటింగ్ స్పాట్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన వారంతా ఈ వేసవిలో ‘ఆచార్య’ మెగా ట్రీట్‌ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు ‘సిద్ద’ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. తండ్రీ కొడుకులు వెండితెరపై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.