BCCI Prize Money: అండర్-19 అమ్మాయిలకు బీసీసీఐ బిగ్ ప్రైజ్ మనీ

మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించింది. మలేసియాలో జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన కనబరిచారు. కేవలం 82 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా, 83 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ విజయంలో తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అసాధారణ ప్రదర్శన చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు, బ్యాటింగ్‌లోనూ 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మొత్తం టోర్నమెంట్‌లో 309 పరుగులు, 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులను దక్కించుకుంది. బౌలింగ్ విభాగంలో వైష్ణవి శర్మ 17 వికెట్లు, ఆయుశి శుక్లా 14 వికెట్లు తీసి టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషించారు.

భారత యువజట్టు 2023 తర్వాత మరోసారి వరల్డ్ కప్‌ను గెలుచుకోవడం విశేషంగా మారింది. బౌలర్లు విరుచుకుపడటంతో, బ్యాటింగ్ విభాగానికి ఒత్తిడి లేకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నారు. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ సాధించడం భారత మహిళా క్రికెట్‌కు గొప్ప మైలురాయిగా మారింది.

ఈ ఘనతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ ప్రకటించిన భారీ నగదు బహుమతితో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా వీర వనితలపై ప్రశంసలు కురిపించారు. భారత మహిళా క్రికెట్ మరింత ఎదుగుతున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో గెలుపెవరిది || Senior Journalist Bharadwaj Analysis On Delhi Elections || Chandrababu || TR