RRR: ఇంతకీ ఆర్ఆర్ఆర్ పై కన్నడిగులు ఎందుకు కన్నెర్ర చేసారు..?

RRR: ఆర్ఆర్ఆర్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా జనవరిలోనే విడుదల కావాల్సినా కరోనా వల్ల వాయిదా పడి చివరకు మార్చి 25నా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఆలియా సీత గా కనువిందుచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు సినిమా మీద అంచనాలను బాగా పెంచాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఉత్కంఠంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ ట్రైలర్.. సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు జక్కన్న అండ్ టీం. పంజాబ్.. ఢిల్లీ.. దుబాయ్.. బెంగుళూరు అంటూ వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆర్ఆర్ఆర్‏కు షాకిచ్చారు కన్నడిగులు. సోషల్ మీడియాలో ఈ మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాను కన్నడ భాషలో పెద్ద ఎత్తున రిలీజ్ కావడం లేదని.. తెలుగుతోపాటు.. తమిళ్, హిందీ భాషలలో భారీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని కన్నడ వర్షన్ తక్కువగా విడుదల చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను అవమానించడమే అంటూ బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ ఇన్ కర్ణాటక అనే హ్యాష్‏ట్యాగ్‏ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడంలో విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మేరకు ప్రత్యేకంగా నోట్‏ను కూడా విడుదల చేసింది. ‘రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పేందుకు ఎంతగానో కృషి చేశారు. మీరు కన్నడలో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారని మేము అర్థం చేసుకోగలము.. ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ ను ప్లే చేయడానికి ఇష్టపడని థియేటర్ యాజమానులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. కన్నడ వెర్షన్ ను రేపటిలోగా అన్ని స్క్రీన్ లలోకి తీసుకువస్తామని మేము హామీ ఇస్తున్నాము.. ‘ అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.