ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ గత రెండు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆగస్టు 7–9 మధ్య జరిగిన సుదీర్ఘ ఆపరేషన్లలో భద్రతా దళాలు మొత్తం 47 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం (ISPR) అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 7–8 రాత్రి జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతం చుట్టుపక్కల విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్స్ జరిగాయి. ఈ దాడిలో 33 మంది ఉగ్రవాదులు చనిపోయారు. వెంటనే ఆగస్టు 8–9 రాత్రి మరో ఆపరేషన్ జరిపి, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 14 మంది ఉగ్రవాదులను చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి.
అంతేకాదు బలూచిస్థాన్ లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఆగస్టు 31 వరకు నిలిపివేస్తున్నట్లు బలూచిస్థాన్ హోం శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం ఆగస్టు 14న జరగనున్న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు ఉగ్రవాదుల దాడులు, ఆందోళనలు నివారించడమే. ఇటీవలే ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 13 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా ఆందోళనలను మరింత పెంచింది.
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) నవంబర్ 2022లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసినప్పటి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో తీవ్రవాద దాడులు పెరిగాయి. అంతేకాదు, బలూచిస్థాన్ వేర్పాటువాద చరిత్ర కూడా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. 19వ శతాబ్దం వరకు స్వతంత్ర గిరిజన పాలనలో ఉన్న ఈ ప్రాంతం, ఇండియా విభజన తరువాత పాకిస్థాన్‌లో విలీనం అయ్యింది. అయితే ఆ సమయంలో స్వతంత్ర దేశం కోసం డిమాండ్లు ఉధృతమవ్వగా, వాటిని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
నేడు భౌగోళిక ప్రాధాన్యం, సహజ వనరులు, చారిత్రక అసంతృప్తి ఇలా అన్నీ కలిసి బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌లో అత్యంత సున్నిత ప్రాంతంగా మార్చేశాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఈ ఆపరేషన్లు, రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత వేడెక్కబోతున్నాయని సంకేతాలిస్తున్నాయి.
