2021లోను విషాద ఛాయ‌లు.. క‌రోనాతో క‌న్నుమూసిన నిర్మాత‌

2020 అంతా వరస విషాదాలు జరిగాయి. ఎంతోమంది సినిమా ప్రముఖులు గతేడాది కన్నుమూసారు. కొత్త ఏడాది మొదలైంది.. ఈ మరణ మృదంగం ఆగుతుందేమో అనుకున్నారు కానీ 2021 కూడా కలిసి రావడం లేదు. ఏడాది మొదలైన తొలిరోజే విషాదం చోటు చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కే బాలు కన్నుమూసాడు. ఈయన అకాల మరణం అక్కడ అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. జనవరి 1 రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే బాలుకి కరోనా వైరస్‌ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

కేపీ ఫిల్మ్స్‌ను స్థాపించిన బాలు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను నిర్మించాడు. ఈయన మరణం తమిళ సినిమా పరిశ్రమకు తీరనిలోటు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు ఆయన బ్యానర్ లో పని చేసిన హీరో హీరోయిన్లు, నటీనటులు. ‘చిన్న తంబీ’ సినిమాతో ఈయన నిర్మాతగా మారాడు. 1991లో విడుదలైన ఈ సినిమాలో ప్రభు, ఖుష్బూ హరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలు నిర్మించాడు బాలు. ఈయన మరణ వార్తను తెలుసుకున్న నటుడు శరత్‌ కుమార్‌ ట్విటర్‌ లో సంతాపం వ్యక్తం చేసాడు. బాలు అకాల మరణం షాక్‌కు గురి చేసిందని.. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆయన తెలిపారు. తమిళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కే బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు శరత్ కుమార్. తమిళ చిత్ర పరిశ్రమ తరపున బాలు కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు. బాలు అంత్యక్రియలు జనవరి 2న చైన్నైలోని బెసంట్‌‌ నగర్‌లో నిర్వహించారు. ఈయన మరణంతో తమిళ సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఏదేమైనా కూడా కొత్త ఏడాది అయినా శుభం కలుగుతుందేమో అనుకుంటే.. తొలి రోజే ఇలాంటి విషాద వార్త వచ్చేసరికి కన్నీరు పెట్టుకుంటున్నారు సినీ ప్రియులు.