కరోనా మహమ్మారి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. కొందరు ఈ వైరస్ వలన నిరాశ్రయిలు కాగా, మరి కొందరు దీనిని క్యాష్ చేసుకొని లాభాలు ఆర్జిస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా వెండితెరపై అద్భుతమైన పాత్రలు చేస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందిన బాలకృష్ణ సరికొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. కరోనా వలన థియేటర్స్ అన్నీ మూతపడడంతో జనాలు ఓటీటీలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఈ విషయాన్ని గ్రహించిన బాలయ్య గతంలో ఆగిన సినిమాలని డిజిటల్ ప్లాట్ ఫాంలలో విడుదల చేస్తూ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తున్నారు.
పదిహేడేళ్ల క్రితం స్వీయ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’కు శ్రీకారం చుట్టారు అగ్రహీరో బాలకృష్ణ. 17 నిమిషాల నిడివిగల సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ద్రౌపది పాత్ర పోషించిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే అప్పటివరకు పూర్తి చేసిన వీడియోని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావించిన బాలయ్య.. విజయదశమిని పురస్కరించుకొని ఈ నెల 24న ఎన్‌బీకే థియేటర్‌లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేశారు . ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు నటించారు. ఈ సినిమా ద్వారా వసూలైన మొత్తంతో కొంతభాగాన్ని ఛారిటీ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు.
నర్తనశాల చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, బాలకృష్ణ మరో చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో విక్రమసింహ భూపతి అనే చిత్రం కొన్నేళ్ళ క్రితం తెరకెక్కగా , ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. 50 శాతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేస్తే బాగుంటుందేమో అని చిత్ర బృందం భావిస్తుందట. మొత్తానికి ఆగిన సినిమాలతోను లాభాలు ఆర్జించాలని బాలయ్య చేసిన ప్లాన్ బహు బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.