పోషకాహారం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే వాటిలో బాదం ఒకటి. ప్రతీ రోజు బాదం తినడం, బాదం పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. చాలా మంది దీనిని ఫాలో అవుతుంటారు కూడా. కానీ దీనికీ ఒక పరిమితి ఉందని, అది తప్పితే సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు, డైటీషియన్లు చెబుతున్నారు.
అతిగా బాదం పాలు తాగడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు కడుపులో ఉబ్బరం, అజీర్తి, వికారం, అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదంలో అధికంగా ఉండే ఫైబర్, కొవ్వులు, ఖనిజాలు ఎక్కువగా శరీరంలో చేరితే అసమతుల్యత కలిగిస్తాయి. పైగా బాదం పాలు గాయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణించబడతాయి కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి.
తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్‌కి బదులు చిన్నపిల్లలకు బాదం పాలు ఇవ్వడం తప్పు అని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బాదం పాలు చిన్నారులకు కావలసిన పూర్తి పోషకాలను అందించలేవు. అంతేకాకుండా, వాణిజ్యంగా తయారు చేసే బాదం పాలు సాధారణంగా ఎక్కువ చక్కెర కలిగి ఉంటాయి. ఇవి తరచుగా తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి బరువు కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా నట్ ఎలర్జీ ఉన్నవారు బాదం పాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఏకంగా బాదం మంచిదే కాదని కాదు, కానీ మితి తప్పితే మంచిదైనా విషమవుతుందన్నమాట. అసలు బాదంలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు ఉండి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి ఆహారానికి మితి చాలా ముఖ్యం. బాదం పాలు తాగాలంటే ఇంట్లోనే చక్కెర లేకుండా తయారు చేసి మితంగా తీసుకుంటే బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)