మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఆహారం ద్వారా సరిపడితేనే పూర్తి ఆరోగ్యంగా ఉంటాం. అందులోనూ సహజ ఔషధ గుణాలు ఉన్న పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి. అటువంటి వాటిలో వెల్లుల్లి చాలా ముఖ్యమైనది. దీన్ని కూరల్లో, పచ్చళ్లలో, సాంబార్ లో మాత్రమే ఉపయోగిస్తారని అందరూ అనుకుంటారు.. అయితే వెల్లుల్లి పాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సామాన్యంగా వెల్లుల్లిలో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిని పాలో కలిపి తాగితే ఈ గుణాలు రెండింతలు ఎక్కువై మరిన్ని సమస్యలను తగ్గిస్తాయంట.
కీళ్ల నొప్పులు తగ్గడానికి: పాలల్లో వెల్లుల్లి వేసి మరిగించి ఆ పాలను తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయంట. వృద్ధులు ఎక్కువగా ఇలాగే ఉపయోగిస్తే ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బాలింతలకు ఎంతో మేలు: కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు వెల్లుల్లి పాలను తాగితే పాలను పెంచే శక్తి దొరుకుతుంది. పాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాకుండా తల్లీ బిడ్డకు అవసరమైన శక్తి ఇస్తుంది.
అధిక కొవ్వును తగ్గించడానికి: అధిక బరువు, కొవ్వుతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లి పాలను తాగితే కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేదం చెబుతోంది.
జీర్ణ సమస్యలకు చెక్: జీర్ణ సమస్యలున్నప్పుడు దంచిన వెల్లుల్లిని పాలలో మరిగించి తాగితే అద్భుత ఫలితం దొరుకుతుందంట. గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్ కి ఉపశమనం: తలనొప్పి, మైగ్రేన్ బాధ కలిగేవారు వెల్లుల్లి పాలను తాగితే కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
మలబద్ధకానికి సరైన పరిష్కారం: మలబద్ధకంతో బాధపడేవారు కూడా ఈ పద్ధతిని పాటిస్తే మలబద్ధకం తగ్గుతుంది. పాలలో వెల్లుల్లి మరిగించి గోరువెచ్చగా తాగడం లేదా నీటిలో వెల్లుల్లి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. (గమనిక: ఇది నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే. దయచేసి ఇలాంటి పద్ధతులు ప్రయత్నించే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. తెలుగు రాజ్యం దీనిని ధృవీకరించడం లేదు.)