మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు 2018 మూవీ దేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారింది. కేరళలోని వరదల నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల మొదటి వారంలో రిలీజ్ అయ్యింది. ఇక ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. ఇప్పటికే మలయాళీ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది.
గతంలో మోహన్ లాల్ పులి మురుగన్ 135 కోట్ల తో హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఇప్పుడు 2018 సినిమా ఈ రికార్డ్ కి కేవలం 17 రోజుల్లోనే బ్రేక్ చేయడం విశేషం. ఇక కేరళ రాష్ట్రంలో పులిమురుగన్ పేరు మీదుగానే ఆల్ టైం హైయెస్ట్ స్టేట్ కలెక్షన్స్ 78 కోట్ల గ్రాస్ ని అందుకునే దిశగా ఇప్పుడు 2018 చిత్రం పరుగులు పెడుతోంది.
ఇప్పటికే కేరళలో కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుని బ్రేక్ చేసిన ఈ చిత్రం తాజాగా బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ 75 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు 2018 చిత్రానికి కేరళ రాష్ట్రంలో 75.20 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఓవరాల్ గా చూసుకుంటే 150 కోట్లకి చేరువ అయినట్లు కనిపిస్తోంది. టోవినో థామస్ ఈ మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ యంగ్ హీరో కెరియర్ లోనే ఇప్పుడు 2018 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. పులిమురుగన్ కలెక్షన్స్ ని ఈ వారాంతానికి అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. మౌత్ టాక్ తో కచ్చితంగా ఈ సినిమా తెలుగు నాట రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.
తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తమిళ్, కన్నడ, హిందీ భాషలలో కూడా 2018 చిత్రాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంతారా తరహాలోనే ఈ మూవీ కూడా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.