బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దేవరాజ్ అనే వ్యక్తి వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నదని అందరూ ఆరోపిస్తున్నా.. ఒక్క దేవరాజ్ వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకోలేదని.. మొత్తం ముగ్గురు వ్యక్తులు శ్రావణి బలవన్మరణానికి కారణమయ్యారని తెలుస్తోంది.
ఆ ముగ్గురిలో ఒకరు దేవరాజ్ కాగా.. మరో ఇద్దరు సాయికృష్ణారెడ్డి, ఆరెక్స్ 100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి. అలాగే శ్రావణి తల్లిదండ్రులు కూడా ఆమెను హింసించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
శ్రావణి 2012లో సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ కు చేరుకుంది. అప్పటి నుంచి అడపా దడపా కొన్ని క్యారెక్టర్లలో నటిస్తూ వచ్చింది శ్రావణి. 2015 లో శ్రావణికి సాయికృష్ణారెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదే సాయికృష్ణారెడ్డి ద్వారా 2017లో ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.
కట్ చేస్తే.. 2019లో టిక్ టాక్ ద్వారా దేవరాజ్ అనే వ్యక్తి శ్రావణికి పరిచయం అయ్యాడు. అయితే.. దేవరాజ్ సంగతికి సాయికృష్ణారెడ్డికి తెలిసింది. దీంతో దేవరాజ్, శ్రావణిని విడగొట్టడానికి ప్రయత్నించాడు. వాళ్ల విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆ విషయం నచ్చని శ్రావణి తల్లిదండ్రులు ఆమెను హింసించసాగారు.
నిజానికి దేవరాజ్ నే పెళ్లి చేసుకోవాలని శ్రావణి అనుకుంది. అందుకు తనతో క్లోజ్ గా ఉంది. కానీ.. దేవరాజ్ తనను మోసం చేస్తున్నాడన్న విషయాన్ని శ్రావణి కాస్త లేటుగా తెలుసుకుంది.
మరోవైపు అశోక్ రెడ్డి.. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మబలికి శ్రావణిని మోసం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. శ్రావణి, దేవరాజ్ విషయాన్ని సాయికృష్ణారెడ్డి.. అశోక్ రెడ్డికి కూడా చెప్పడంతో ఎలాగైనా వాళ్లిద్దరినీ విడదీయాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు.
అయితే.. ఈనెల 7న ఓ హోటల్ వద్ద శ్రావణికి, దేవరాజ్ కు గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత శ్రావణిని సాయికృష్ణారెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అశోక్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో శ్రావణిని ఇద్దరు కలిసి శారీరకంగా హింసించినట్టు సమాచారం.
అలా.. నమ్మిన ముగ్గురు వ్యక్తులు మోసం చేయడంతో కుంగిపోయిన శ్రావణి.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సార్ నగర్ పోలీసులు ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో ఇంకెన్ని నిజాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే.