బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నటి ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్నేహితుడు దేవరాజు రెడ్డి వెల్లడించారు. కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అతను ఆరోపించాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశంలో దేవరాజు రెడ్డి వెల్లడించారు. శ్రావణిని హింసించి కొట్టడంతో అవమానం, బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
సెప్టెంబర్ 7న తాను, శ్రావణి కలిసి డిన్నర్‌కి వెళ్లామని.. అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణి పై చేయి చేసుకున్నాడని దేవరాజు చెప్పారు. శ్రావణికి సాయి అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి పరిచయం ఉందన్నారు. తాను సంవత్సరం క్రితమే శ్రావణికి పరిచయం ఆయన వివరించారు.
తనకు శ్రావణి చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు తనను సాయి, కుటుంబ సభ్యులు హింసిస్తున్నారంటూ అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పిందని పేర్కొన్నాడు. చావు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని తాను శ్రావణికి చెప్పానంటూ, అందుకు సంబంధించిన కాల్ రికార్డ్‌ను అతడు బయటపెట్టాడు
ప్రైవేట్ ఫోటోలతో తాను శ్రావణిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైంది తప్పుడు కేసు అని వివరించాడు. ఈ విషయాన్ని శ్రావణి స్వయంగా ఒప్పుకొందన్నాడు. కుటుంబసభ్యులే ఒత్తిడి చేసి ఆ కేసు పెట్టించారని ఆరోపించాడు. శ్రావణి తనను ఇష్టపడిందని.. అందుకే తనకు ఇన్ని సమస్యలు వచ్చాయని ఓ వీడియో రిలీజ్ చేశాడు.