అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలు అద్భుతంగా ఉన్నాయని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో అనేకమంది సినీ తారలు పాల్గొన్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు.
తిరిగి ముంబయి వెళ్తూ తన బ్లాగ్‌లో నోట్ రాశారు. ‘అట్టహాసంగా నిర్వహించిన వేడుకలతో పాటు, వంతారా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రశంసనీయం. ఈ వేడుకలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. వంతారా సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స అందించి వాటికి పునరావాసం ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఒక కృత్రిమ అడవిని ఏర్పాటు చేసి వన్యప్రాణుల్ని కాపాడాలన్నది మంచి ఆలోచన. విూరందరూ దీనిని సందర్శించాలి. ఇదో గొప్ప అనుభవం‘ అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో రణ్‌బీర్-అలియా, దీపికా-రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ తదితర బాలీవుడ్ జంటలు ప్రత్యేకంగా డాన్స్ చేసి సందడి చేశాయి. బాలీవుడ్ ఖాన్స్ త్రయం సల్మాన్, షారుక్, ఆమిర్‌తో కలిసి హీరో రామ్ చరణ్ ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసి అలరించారు. వీరితోపాటు అక్షయ్‌కుమార్, జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీఖాన్, ఖషీ కపూర్..తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.