IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక విజయం నమోదు చేసింది. లఖ్‌నవూలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 42 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికను కుదిపేసింది. టాప్-2లో నిలవాలన్న బెంగళూరు ఆశలకు ఈ ఓటమి బిగ్ షాక్‌గా మారింది. దీంతో ఆ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ నెట్‌రన్‌రేట్ ఆధారంగా రెండో స్థానానికి చేరింది.
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 231 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు గట్టిగా మొదలుపెట్టినా, చివర్లో తడబడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (62), విరాట్ కోహ్లీ (43) తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం అందించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మధ్యలో వరుస వికెట్లు పడిపోవడంతో స్కోరు ప్రగతికి బ్రేక్ పడింది.
రజత్ పటీదార్ (18), మయాంక్ అగర్వాల్ (11), జితేశ్ శర్మ (29) క్రీజులో నిలబడే ప్రయత్నం చేసినా, డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు బెంగళూరును పూర్తిగా కట్టేసారు. 16వ ఓవర్లో రజత్ రనౌట్ కావడంతో మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివరి ఐదు ఓవర్లలో కేవలం 22 పరుగులు వచ్చాయి, 7 వికెట్లు పడిపోయాయి. భారీ హిట్టర్లు షెఫర్డ్, డేవిడ్‌లు కూడా విఫలమయ్యారు.
హైదరాబాద్ బౌలింగ్ వైపు కెప్టెన్ కమిన్స్ (3 వికెట్లు), ఇషాన్ మలింగ (2 వికెట్లు) బెంగళూరును కీలక సమయంలో గల్లంతు చేశారు. మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ తీశారు. ఈ గెలుపుతో హైదరాబాద్ పరువు నిలబెట్టుకుంది. మరోవైపు, బెంగళూరుకు మిగిలిన ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచినా టాప్-2కి చేరడం డౌట్.