Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ లావెండర్ జెర్సీల వెనుక ఓ మంచి సంకల్పం

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ సామాజిక బాధ్యతను మరోసారి చాటుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాళ్లు లావెండర్ రంగు ప్రత్యేక జెర్సీలను ధరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేందుకు గుజరాత్ జట్టు ఇది వరుసగా మూడో సంవత్సరం చేపట్టిన కార్యక్రమం కావడం విశేషం. ఈ ప్రత్యేక డ్రెస్‌తో జట్టు మైదానంలో అడుగుపెట్టడం ద్వారా క్యాన్సర్ రోగులపై సంఘీభావాన్ని వ్యక్తం చేసింది.

జట్టు సీఓఓ కల్నల్ అర్విందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, చికిత్స చేయడం ద్వారా అది ఓడించదగిన వ్యాధి అని చెప్పే ప్రయత్నమే ఇది. ప్రజల్లో చైతన్యం రావాలంటే క్రికెట్ వంటి వేదికలు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి” అన్నారు. అదే విధంగా జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా క్యాన్సర్ యోధులకు మద్దతుగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. క్రీడాకారులుగా తమకు ఉన్న బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సమాజంలో సానుకూల మార్పుకు మద్దతుగా నిలవాలన్నదే తమ ఆశయం అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ టైటన్స్ యాజమాన్యం దాదాపు 30 వేల లావెండర్ జెండాలు, 10 వేల లావెండర్ జెర్సీలను అభిమానులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వేలాది మంది అభిమానులు క్యాన్సర్ పై చైతన్య కార్యక్రమానికి మద్దతుగా తమ లావెండర్ జెండాలతో హాజరై సందేశాన్ని బలపరిచారు.

మ్యాచ్ ఫలితాన్ని చూస్తే గుజరాత్ టైటన్స్‌కు ఇది సంతృప్తికరమైన రోజు కాలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 235 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (117), నికోలస్ పూరన్ (56*) రాణించగా, గుజరాత్ 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. షారుక్ ఖాన్ (57) పోరాడినా విజయానికి చేర్చలేకపోయాడు. ఫలితంగా లక్నో 33 పరుగుల తేడాతో గెలుపొందింది.