పుష్ప 2: రెండవ రోజు దెబ్బ పడినట్లే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ దర్శకత్వానికి ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ప్రీమియర్ షోలతోనే భారీగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.165 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే, మొదటి రోజు హవాను కొనసాగిస్తూ రెండవ రోజూ అదే స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని భావించినప్పటికి ఊహించిన విధంగా ఫలితాలు రాలేదని సమాచారం. ముఖ్యంగా టికెట్ ధరలపై ఉన్న విమర్శలు రెండవ రోజు కలెక్షన్లపై ప్రభావం చూపించాయని అంటున్నారు. హైదరాబాదు, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో టికెట్ ధరల కారణంగా ప్రేక్షకులు కొంత వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

రెండవ రోజు బుకింగ్స్ మందగించినప్పటికీ, సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని శనివారం ఆదివారం కలెక్షన్లు తిరిగి పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకుల నుంచి సినిమా మంచి ఆదరణ పొందుతోందని, వీకెండ్‌లో ఈ ప్రభావం బలంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక టికెట్ ధరలపై పెరుగుతున్న విమర్శలను తగ్గించడానికి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. టికెట్ ధరలు సాధారణ స్థాయికి వస్తే, మిగిలిన రోజుల్లో కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.