అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మరో చిత్రం పుష్ప. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయి రికార్డును సృష్టించింది.
ఈ సినిమ స్టోరీ లైన్ కూడా ఎప్పుడో లీక్ అయింది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉన్న గంధపు చెక్కల స్మగ్లింగ్ లైన్ తో ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా కనిపించనున్నాడు.
అంతా బాగానే ఉన్నది కానీ.. ప్రస్తుతం ఈ సినిమాపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా కాపీ స్టోరీ అని.. సుకుమార్ సొంత స్టోరీ కాదంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత డా. వేంపల్లి గంగాధర్… పుష్ప సినిమాకు సంబంధించి ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
తను రాసిన ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు.. అనే పుస్తకాన్ని కాపీ కొట్టి సినిమాను తీస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా ఆరోపించారు. తెలుగు సాహిత్యకారులను సినిమా రంగం తొక్కేస్తోందని.. ఇది ఇప్పుడు కొత్తేమీ కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ను కూడా ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. సాక్షి పేపర్ లో 2018 లో ఎర్రచందనం స్మగ్లింగ్ పై కథను రాశానని.. దానితో పాటుగా తను రాసిన ఎర్రచందనం పుస్తకాన్ని కూడా కాపీ చేసి స్టోరీ తయారు చేసుకొని ఇప్పుడు సినిమాను తీస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
అయితే.. గతంలోనూ వేంపల్లి రాసిన మొండి కత్తి పుస్తకాన్ని ప్రేరణగా తీసుకొని త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తీశాడని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఆయనే రాసిన పుస్తకాన్ని కాపీ కొట్టి సుకుమార్ పుష్ప అనే సినిమా తీస్తున్నాడంటూ స్వయానా వేంపల్లే ఆరోపిస్తుండటంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కుదపు వచ్చినట్టయింది.
అయితే.. దీనిపై సుకుమార్ కానీ.. మూవీ యూనిట్ కానీ ఇంత వరకు స్పందించలేదు. ఇక.. వేంపల్లి పెట్టిన పోస్టుకు మాత్రం నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. పెద్దఎత్తున నెటిజన్లు ఆయనకు మద్దతు పలికారు. దీనిపై న్యాయపోరాటం చేయాలని హితువు పలికారు.