Ajith Kumar: రిటైర్మెంట్‌పై అజిత్ సంచలన వ్యాఖ్యలు: అభిమానుల్లో కలకలం!

తమిళ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్ తన భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నుంచి తప్పుకునే రోజు ఎప్పుడైనా రావచ్చని అజిత్ చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నటన తన జీవితంలో తుది లక్ష్యం కాదని, అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చానని పేర్కొన్నారు.

ఏదైనా సమయం వచ్చినప్పుడు ప్రేక్షకులు తనపై ఆసక్తి కోల్పోక ముందే, తనంతట తానే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని హింట్ ఇచ్చారు. జీవితం విలువైనది అని చెప్పిన అజిత్… ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తనకు ఎంతో నేర్పించాయన్నారు. తన సన్నిహితులు కొంతమంది ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న నేపథ్యంలో జీవితం విలువ ఎలా ఉన్నదో అర్థమైందని చెప్పారు. “ఇప్పటిదాకా సినిమా కోసం పని చేశాను, ఇకనైనా జీవితాన్ని గడపాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది,” అని పేర్కొన్నారు.

ఫ్యామిలీతో సమయం గడపడం, ప్రయాణాలు చేయడం వంటి పనులపై ఆసక్తి పెరిగిందని తెలియజేశారు. సినీ రంగ ప్రవేశం తనకు యాదృచ్ఛికమని, అప్పుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నటనను ఎంపిక చేసుకున్నానని అజిత్ చెప్పారు. తొలి సినిమాల్లో తాను మంచి నటుడు కాదని, తన తమిళ భాషా ఉచ్చారణ కూడా సరైనది కాదని ఆత్మపరిశీలన చేసుకున్నారు. మొదట్లో తన పాత్రలకు ఇతరులే డబ్బింగ్ చెప్పేవారని గుర్తు చేశారు.

అంతే కాదు, కొంతమంది ఇప్పటికీ తన పాత యాసను అనుకరిస్తూ ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఆ విమర్శలకు కాస్త కూడా బాధపడకుండా, అజిత్ తన దృష్టిని అభివృద్ధి మీదే కేంద్రీకరించారు. ఇకపై సినిమాలకంటే జీవితాన్ని ఎలా ఆనందించాలో నేర్చుకోవాలన్నదే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో అజిత్ అభిమానుల్లో రిటైర్మెంట్ భయాందోళనలు మొదలవుతున్నాయి.

Copy of 🔴 LIVE: Amaravati | PM Modi | CM Chandrababu | Pawan Kalyan | Nara Lokesh  || Telugu Rajyam