స్ట్రెయిట్ తెలుగు సినిమాలో తమిళ హీరో అజిత్.!

అజిత్ కుమార్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో. తెలుగులో అతని సినిమాలకి ఓ మోస్తరు మార్కెట్ మాత్రమే వుంది. హిట్ సినిమాలున్నా, తెలుగులో ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినాగానీ, అతనికి ఫాలోయింగ్ అయితే గట్టిగానే వుంది తెలుగునాట.

ఈ మధ్య తమిళ హీరోలతో తెలుగు సినిమాలు చేయడం అనే ట్రెండ్ షురూ అయ్యింది. తెలుగు నిర్మాతలు, తమిళ హీరోలపై స్పెషల్ ఫోకస్ పెడుతుండడమే అందుక్కారణం. అవి తెలుగు సినిమాలా.? తమిళ సినిమాలా.? అన్న విషయమై కొంత గందరగోళం వుంటోందనుకోండి.. అది వేరే సంగతి.

అసలు విషయానికొస్తే, అజిత్ కుమార్ త్వరలో ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడట. ఓ తెలుగు నిర్మాత, ఓ తెలుగు దర్శకుడు ఇటీవల అజిత్ కుమార్‌ని కలిసి ఓ కథ చెప్పారనీ, తెలుగు నేటివిటీతోనే సినిమా వుంటుందనీ అంటున్నారు.

ద్విభాషా చిత్రం తరహాలో సైమల్టేనియస్‌గా రెండు భాషల ట్రాక్‌లూ చిత్రీకరించేలా ప్రాజెక్టుని డిజైన్ చేశారట. అజిత్ ఈ ప్రాజెక్టుకి ఇప్పటికే సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు.

ద్విభాషా చిత్రం అనే పేరున్నా, తమిళ వాసనలే ఎక్కువగా వుంటాయ్ తమిళ హీరోలతో తెలుగు నిర్మాతలు, తెలుగు దర్శకులు తీసే సినిమాలకి. మరి, అజిత్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.