కన్నడలో కదులుతున్న డొంక.. డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్ట్

ప్రస్తుతం కన్నడ పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు డ్రగ్స్ కోరల్లో టాలీవుడ్, సినీ ప్రముఖులు ఎలా చిక్కుకున్నారో ప్రస్తుతం కన్నడ పరిశ్రమ, అక్కడి సెలెబ్రిటీలు సైతం చిక్కుకున్నారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌ను మట్టుబెట్టేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ రంగంలోకి దిగింది. ఇటువైపు కన్నడలోనూ జోరుగా అరెస్ట్‌లు, విచారణలు జరుగుతున్నాయి. తాజాగా బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

  Actress Sanjjanaa Galrani Arrested In Drug Case
Actress Sanjjanaa Galrani Arrested In Drug Case

డ్రగ్స్‌ కేసులో సంజన స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సంజనాపై ఓ కన్నేసి ఉంచారు అధికారులు. ఓ వైపు డ్రగ్స్‌ అక్రమ రవాణా ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు 13మందిపై కేసు నమోదు చేయగా, ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో కన్నడ నటి రాగిణి ద్వివేది కూడా ఉంది. ఇక తాజాగా సంజనా ఇంట్లోనూ సోదాలు, దాడులు నిర్వహించినట్టు సమాచారం.

కోర్టు నుంచి సర్చ్‌ వారెంట్ పొందిన తరవాతనే సంజన ఇంట్లో సోదాలు జరిపామని పోలీసు ఉన్నతాధికారి సందీప్‌ పాటిల్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఇందిరా నగర్‌లోని నటి ఇంట్లో సీసీబీకి చెందిన అధికారులు సోదాలు జరిపి, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సంజనాను విచారించిన పిమ్మట మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశముంది. ఇందులో కన్నడ స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నట్టు సమాచారం.