నటి హరితేజ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై, వెండితెరపై తన కంటూ ఓ ముద్రను వేసుకుంది. బుల్లితెరపై భయంకరమైన విలనిజాన్ని పండించిన హరితేజ.. వెండితెరపై బీభత్సమైన కామెడీని పండించింది. సినిమాలు, సీరియళ్లు ఆమెకు ఒక రకమైన ఇమేజ్‌ను తీసుకొస్తే బిగ్ బాస్ షో మాత్రం క్లీన్ పాజిటివ్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. బిగ్ బాస్ షో మొదటి సీజన్‌లో హరితేజ అందించిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. డ్యాన్సులు, పాటలు, హరికథలు ఇలా అన్ని రకాలు అందరినీ అలరించింది.
హరితేజకు బిగ్ బాస్ తరువాత భారీ ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి హరితేజ సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం ప్రారంభించింది. నిత్యం తన అభిమానులతో సందడి చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్స్ అడిగే కొంటె ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. తన సుమధుర గాత్రాన్ని కూడా వినిపిస్తూ అలరిస్తుంటుంది. తాజాగా హరితేజ తన సీమంతం వేడుకల్లోనూ రచ్చ రచ్చ చేసింది. మామూలుగా హరితేజ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది.
2016లో దీపక్ రావును పెళ్లి చేసుకుంది హరితేజ. ఇక నిన్న హరితేజకు సీమంతం జరిగింది. ఈ వేడుకలో తన స్నేహితులు, సెలెబ్రిటీలు, అందరూ హాజరయ్యారు. వీరందరితో కలిసి హరితేజ చిందులు వేసింది. నిండు గర్భిణితో ఉన్నా కూడా హరితేజ వేసిన స్టెప్పులు చేసిన అల్లరి మాత్రం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హరితేజ డ్యాన్సింగ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. హరితేజకు అందరూ కంగ్రాట్స్ చెబుతూ పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు.