Tollywood: ఇటీవల దంగల్ సినిమా నటి ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తన ఇబ్బంది పడ్డానని, హైదరాబాద్ కు చెందిన కొందరు ఏజెంట్లు అవకాశం ఇప్పిస్తానంటూ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా తనని పరోక్షంగా అటువంటి ప్రశ్నలే వేశారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై మరొకసారి ఫాతిమా స్పందించింది. ఈ సందర్భంగా ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో నేను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమే. కానీ నేను చేసిన వ్యాఖ్యలు కొందరు తప్పుగా అపార్థం చేసుకున్నారు.
ఒక వ్యక్తి వల్ల మాత్రమే నేను అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అతను ఒక ఏజెంట్ కావచ్చు లేదా చిన్న నిర్మాత కావచ్చు. కానీ నేను దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తప్పు పట్టలేదు. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అదేపనిగా అక్కడి పరిశ్రమ మొత్తాన్ని ఆపాదిస్తూ ప్రచారం చేయడం చాలా తప్పు అని చెప్పుకొచ్చింది. అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగ చూసే వారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది అని ఆమె తెలిపింది.