తెలుగు చిత్రం సీమలో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న కమెడియన్, విలన్ జయప్రకాష్ రెడ్డి(74) మరణించారు. ఫ్యాక్షన్ సినిమాలో విలనిజంతో ఎంతో మందిని భయపెట్టించిన జయప్రకాష్ రెడ్డి.. ఆపై కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి మరణించారు.
గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లోనే కుప్పకూలగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల.
సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నాటకాల్లోనూ ఆయనకు అనుభవం ఉంది. ఇక ఫ్యాక్షన్ సినిమాలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడులో ప్రత్యేకమైన నటనను కనబర్చారు.అంతేస్థాయిలో కామెడీ పాత్రలను పోషించి ఎంతో మందిని నవ్వించారు. ప్రస్తుతం ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.