Abhishek Bachchan: మొత్తం ఇచ్చేశా.. నాదగ్గర ఏమీ లేవు.. అభిషేక్ బచ్చన్ ఇలా అన్నాడేంటి..?

బాలీవుడ్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం ఎప్పుడూ మీడియా ఫోకస్‌లో ఉంటుంది. ఇందులో కూడా ముఖ్యంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంటపై గత కొంతకాలంగా విడాకుల గాసిప్‌లు.. ఇవి గత కొంతకాలంగా తారస్థాయికి చేరుకున్నాయి. ఈ జంట విడిపోతున్నారన్న వార్తలు ఎన్నోసార్లు వినిపించినా, వారు వాటిపై ఎప్పుడూ ఓపెన్‌గా స్పందించలేదు. కానీ తాజాగా అభిషేక్ చేసిన ఓ భావోద్వేగ పోస్టు, మరోసారి ఈ రూమర్లకు కారణమైంది.

నాకు ఇష్టమైన వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా… ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కొంతకాలం ఈ సమాజం నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. నా కోసం టైమ్ కేటాయిస్తా. నన్ను నేను ప్రేమించుకోవడం ఇప్పుడు చాలా అవసరం” అంటూ అభిషేక్ షేర్ చేసిన ఈ సోషల్ మీడియా స్టేటస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులోని ప్రతి పదం వెనుక ఒక లోతైన బాధ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ 2007 ఏప్రిల్ 20న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకథ కూడా అప్పట్లో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే మారింది. ఇద్దరూ ధూమ్ 2, గురు వంటి సినిమాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమ మొదలై, కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఆరాధ్యా అనే కూతురు ఉంది, ప్రస్తుతం ఆమె స్కూల్ లో చదువుతోంది.

తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్‌ను నెటిజన్లు ఐశ్వర్యను ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. అన్నీ ఇచ్చేశానంటే.. ఐశ్వర్యకే అన్నీ ఇచ్చేశాడా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. పైగా గత కొంతకాలంగా ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించకపోవడం కూడా రూమర్లకు బలం ఇస్తోంది. గతంలో బచ్చన్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా ఐశ్వర్య ఉండే వారు. కానీ ఇటీవలి ఫ్యామిలీ ఫంక్షన్లలో ఆమె గైర్హాజరుగా ఉండటం ప్రశ్నలు లేపుతోంది.

అభిషేక్ చేసిన ఈ పోస్ట్ కొత్తగా పుట్టాలనుకుంటున్నా అన్న ఆత్మాన్వేషణ టోన్‌లో ఉండటంతో అభిమానులు కూడా ఇదేంటి.. అభిషేక్ పర్సనల్‌గా ఆందోళనలో ఉన్నాడా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు మాత్రం నిజమైన ప్రేమే అయితే వాళ్లు తిరిగి కలుస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పందిస్తుందా.. ఈ పోస్టు వెనుక ఉన్న అసలు నేపథ్యం ఏమిటి.. అభిషేక్ మాటలు నిజంగా విడాకుల సంకేతమా.. అనే ప్రశ్నలు ఇంకా నెటిజన్లను వేధిస్తూనే ఉన్నాయి. మరి ఈ జంట తమ మౌనాన్ని ఎప్పుడు వీడుతుందో చూడాలి.