2019 ఏడాదిగానూ 67వ జాతీయ పురస్కారాల విజేతలను సోమవారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రంగా మోహన్ లాల్ మరక్కర్ నిలవగా.. ఉత్తమ నటులుగా ధనుష్(అసురన్), మనోజ్ భాజ్‌పేయ్(భోంస్లే) నిలిచారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్(క్వీన్) ఎంపిక అయ్యారు. ఇక ఈసారి తెలుగు చిత్రాలు కూడా సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా నాని జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేష్ బాబు మహర్షి, ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి(జెర్సీ), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం(మహర్షి), ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి) జాతీయ అవార్డులకు ఎంపిక అయ్యాయి.
ఇక ఉత్తమ హిందీ చిత్రంగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిచ్చోరే నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన నవీన్ పొలిశెట్టి, సుశాంత్ గురించి ఓ భావోద్వేగ ట్వీట్‌ని పెట్టారు. ఉత్తమ హిందీ చిత్రంగా చిచ్చోరే జాతీయ అవార్డును దక్కించుకుంది. జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు సుశాంత్. ఇది నీ కోసమే. మిస్ యు భాయ్. నితేష్ సర్, మాయ, డెరెక్, బేవ్‌డా, సెక్సా, మమ్మీ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. మీ యాసిడ్ అని నవీన్ కామెంట్ పెట్టారు. మరోవైపు సుశాంత్ అభిమానులు కూడా ఆయనను తలుచుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి ఆఫర్ రావడం వెనుక పెద్ద కథనే ఉంది. నితేష్ తెరకెక్కించిన చిచ్చోరేలో ఒక పాత్ర కోసం మొదట మలయాళ నటుడు నివిన్ పాలీని దర్శకుడు నితేష్ అనుకున్నారట. అఈ విషయాన్ని ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా(సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా దర్శకుడు)కు నితేష్ చెప్పారట. అయితే ఆ పేరును నవీన్ పాలీగా విన్న ముఖేష్ చాబ్రా నవీన్ పొలిశెట్టికి ఫోన్ చేసి రమ్మన్నారట. అప్పటికే ముఖేష్ చాబ్రా, నవీన్‌ని 50 సార్లకు పైగానే రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తరువాత నవీన్‌ని చూసిన నితేష్.. మేము అనుకున్నది నిన్ను కాదు నవీన్ పాలీని అని చెప్పి అతడికి సారీ చెప్పారట. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నవీన్ నటించిన ఒక వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారడం, దాన్ని నితేష్ చూసి సుశాంత్ నటించిన చిచ్చోరేలో నవీన్‌కి యాసిడ్ పాత్ర ఇవ్వడం జరిగిందట. దీన్నంతా నవీన్ ఒక షోలో చెప్పాడు