ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిమ కనబరిచన వారికి జాతీయ అవార్డులను ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా వలన ఈ వేడుక ఆగిపోయింది. అయితే కొద్ది సేపటి క్రితం. 2019 సంవత్సరానికి గాను 67వ జాతీయ అవార్డుల అనౌన్స్‌మెంట్ చేశారు. ఇందులో తెలుగు, మలయాళ సినిమాలు దూసుకుపోతున్నాయి. నాని నటించిన జెర్సీ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రంలో క్రికెట్‌ను అమితంగా ప్రేమించే వ్యక్తిగా నాని నటించాడు. అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోసం మళ్లీ దేశం కోసం క్రికెట్ ఆడి ప్రాణాలు కోల్పోతాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షాహిద్ కపూర్ ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఉత్తమ తమిళ చిత్రంగా ధనుష్ నటించిన అసురన్ జాతీయ అవార్డ్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ అవుతుండగా, ఇందులో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలోని సాంగ్‌కు రాజు సుందరం కొరియోగ్రఫీ చేయగా, ఆయనకు జాతీయ అవార్డ్ దక్కింది. ఇక దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే సినిమాకు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు దక్కింది. ఇక మణికర్ణిక.. ద క్వీన్ ఆఫ్ జాన్సీ, పంగా చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.