Vastu Tips: సంపాదన నిలవడం లేదా.. బీరువా ఉన్న దిశే ఆర్థిక సమస్యలకు అసలు కారణం..?

ప్రస్తుతం డబ్బు లేకుండా జీవితం ఊహించడమే కష్టం. ప్రతీ అవసరం డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ మనుషులు కష్టపడుతున్నారు. మంచి జీతం, వ్యాపారం, ఆదాయం ఉన్నా కూడా మంది మనసులో మెదిలే ప్రశ్న ఒకటే.. ఎంత సంపాదించినా డబ్బు ఎందుకు నిలవడం లేదు అని.
సంపాదన పెరిగినా, ఖర్చులు అదుపులో లేకపోవడం, అప్పులు పెరగడం, చేతికి వచ్చిన డబ్బు చేతిలో నుంచే జారిపోవడం వెనుక కేవలం ఖర్చు అలవాట్లే కాదు… ఇంట్లోని కొన్ని చిన్న విషయాలే కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బు, నగలు దాచుకునే బీరువా విషయంలో జరిగే పొరపాట్లే ఆర్థిక సమస్యలకు మూలమంటున్నారు పండితులు.

చాలా మంది ఇంట్లో బీరువాను ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పెట్టేస్తారు. కొందరు నైరుతి దిశలో పెట్టితే బలంగా ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా సరైన ఆలోచన కాదంటున్నారు నిపుణులు. నైరుతి దిశలో బీరువా పెట్టడం సాధారణంగా మంచిదిగా భావించినా, అదే చోట డబ్బు లేదా బంగారం ఉంచడం మాత్రం శుభం కాదని చెబుతున్నారు. నైరుతిలో డబ్బు ఉంచితే, అది నిలవకుండా వెంట వెంటనే ఖర్చైపోతుందన్న నమ్మకం ఉంది. సంపాదన ఎంత వచ్చినా, చేతిలో నుంచి నీటిలా జారిపోతుందట.

ఇక మరో పెద్ద తప్పిదం చాలా ఇళ్లలో కనిపిస్తుంది. నగలు, డబ్బు ఉన్న బీరువా పైన పాత సూట్‌కేసులు, వాడని బ్యాగులు, అవసరం లేని సామాన్లు పోగేస్తుంటారు. ఇది వాస్తు పరంగా పెద్ద దోషమని పండితులు హెచ్చరిస్తున్నారు. బీరువా పైన భారమైన, పాత వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తగ్గి, ఇంట్లో ఆర్థిక అడ్డంకులు పెరుగుతాయని విశ్వాసం.

వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు నిలవాలంటే బీరువా సరైన దిశలో ఉండడమే కాదు, దాన్ని శుభ్రంగా, ఖాళీగా, గౌరవంగా ఉంచుకోవాలి. అలా చేస్తేనే ధన ప్రవాహం మెరుగుపడి, ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇకనైనా మీ ఇంట్లో బీరువా ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి. చిన్న మార్పే మీ జీవితంలో పెద్ద ఆర్థిక మార్పుకు కారణమయ్యే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.