రాత్రిపూట లైట్లు ఆన్ చేసి నిద్రపోతున్నారా.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా..?

నిద్రపోయే ముందు గదిలోని లైట్లు ఆర్పడం చాలా మందికి సహజ అలవాటు. అయితే కొంతమంది మాత్రం రాత్రంతా లైట్లు వెలిగేలా ఉంచి నిద్రపోతారు. ఇది పెద్ద సమస్య కాదని భావించే వారిలో చాలా మందికి ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇచ్చిన తాజా హెచ్చరిక మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. నిద్ర సమయంలో కేవలం స్వల్ప కాంతి కూడా మన శరీరంపై ఎంతటి ప్రమాదకర ప్రభావాన్ని చూపుతుందో కొత్త అధ్యయనంలో బయటపడింది.

అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మానవ నిద్ర సహజ ప్రక్రియలపై విస్తృత పరిశోధన చేశారు. రాత్రిపూట కాంతి కళ్ళపై పడినప్పుడే మెదడు అప్రమత్తమవుతుందని, దీని వలన శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లకుండా, గుండె స్పందన లోపించాలని ఈ అధ్యయనం స్పష్టంగా నిర్ధారించింది. నిద్రలో శరీరం స్వయంగా నెమ్మదించాల్సిన సమయంలో రక్త ప్రసరణ వేగం పెరగడం గుండెకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చీకటి భయం ఉన్నవారు.. రాత్రిపూట లేవాల్సి వచ్చే అవసరాలు… ఒత్తిడితో నిద్ర లేని వారు.. సోమరితనం వలన లైట్లు ఆపకుండా పడుకునేవారు.. ఇలాంటి అనేక కారణాలతో చాలామంది రాత్రిపూట లైట్లు వేస్తారు. కానీ ఈ అలవాటు దీర్ఘకాలంలో మీ మెదడు, హార్మోన్ వ్యవస్థ, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

కేవలం ఒక చిన్న నైట్ ల్యాంప్ అయినా కళ్ళకు అతి స్వల్పంగా వెలుతురు తగిలినా, స్లీప్ సైకిల్‌ దెబ్బతిని, మెదడు సక్రియం అవుతుందని అధ్యయనం సూచిస్తోంది. దీని వల్ల లోతైన నిద్ర దెబ్బతిని, శరీరం పూర్తిగా విశ్రాంతి పొందే వ్యవస్థలు అసమతుల్యం అవుతాయి. దీర్ఘకాలంలో ఇది హై బీపీ, స్ట్రెస్ లెవల్స్ పెరుగుదల, గుండె సంబంధిత సమస్యలు, రోజువారీ అలసట వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

పరిశోధకులు స్పష్టం చేసిన కీలక సూచన ఏమిటంటే.. రాత్రి నిద్ర సమయంలో పూర్తిగా చీకటి ఉన్నపుడు మాత్రమే శరీరం సహజంగా రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. ప్రతి రాత్రీ లైట్లు ఆర్పి నిద్రపోవడం కేవలం ఒక అలవాటు కాదు.. అది ఆరోగ్య రక్షణలో తొలి అడుగు. నైట్ లైట్ అవసరం ఉందనుకునే వారు కూడా కాంతిని సాధ్యమైనంత కనిష్టానికి తగ్గించాలని నిపుణుల సూచన. రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రపోవడం ఒక నిశ్శబ్ద ప్రమాదం. ఈ చిన్న అలవాటే కాలక్రమంలో మీ గుండె, మెదడు, నిద్ర నాణ్యత, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంది. అందుకే ఈ అలవాటు మార్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.