మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఆస్తి పత్రాలు పోగొట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడి ఉంటారు. ఏ స్థిరాస్థిని కొనుగోలు చేసినా ఆస్తుల కొనుగోలు విషయంలో టైటిల్ డీడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవలనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్తుల కొనుగోలుదారులు అధికారికంగా బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడు ఆస్తి కొనుగోలుదారుని పేరుతో నమోదైన పత్రాలు చేతికి రావడం జరుగుతుంది. టైటిల్ డీడ్ అనేది ఆస్తికి సంబంధించిన చట్టపరమైన హక్కును తెలియజేస్తుంది. అమ్మకం లేదా కొనుగోలు సమయంలో ఈ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను కోల్పోతే అడ్డంకులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను పోగొట్టుకుంటే డూప్లికేట్ కాపీని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తి పత్రాలను మొదట పోలీసులకు సమాచారం ఇచ్చి ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయాలి. పోలీసులు ఆ పత్రాలను ట్రేస్ చేయడంలో ఫెయిల్ అయితే నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్ ను ఇస్తారు. ఆస్తి దేశంలో ఎక్కడ ఉన్నా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తర్వాత రెండు వార్తా పత్రికల్లో నోటీస్ ను ప్రచురించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా ఎవరికైనా ఆస్తికి సంబంధించిన పత్రాలు దొరికితే తిరిగి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. హౌసింగ్ సొసైటీలో ఆస్తి ఉంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి డూప్లికిట్ షేర్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. డూప్లికేట్ సర్టిఫికెట్ కాపీ కావాలంటే 10 రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ చేయించాలి. నోటీస్ వ్యవధి ముగిసిన తర్వాత డూప్లికేట్ టైటిల్ డీడ్ కాపీని పొందే ఛాన్స్ ఉంటుంది.