రాత్రిపూట గోళ్లు తీస్తే ఏమవుతుంది.. భయపెట్టే పెద్దల మాట వెనుక నిజం ఇదే..!

చిన్నప్పుడెప్పుడైనా రాత్రి నెయిల్ కట్టర్ చేతిలోకి తీసుకుంటే.. వెంటనే పెద్దవాళ్ల గొంతు వినిపించి ఉంటుంది. చీకటి పడ్డాక గోళ్లు తీయకూడదు.. లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అంటూ భయపెడుతుంటారు. అప్పట్లో అది వింతగా అనిపించినా, పెద్దయ్యాక కూడా చాలామంది ఆ మాటను పాటిస్తూనే ఉంటారు. అసలు ఈ మాట వెనుక నిజంగా మూఢనమ్మకముందా..? లేక మనకు తెలియని ఏదైనా లాజిక్ ఉందా..? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికరమైన నిజాలు బయటపడుతున్నాయి.

నేటి సౌకర్యాలతో చూస్తే రాత్రిపూట గోళ్లు తీయకూడదు.. అనే మాట అర్థం లేనిదిలా అనిపిస్తుంది. కానీ కాస్త వెనక్కి వెళ్లి, కరెంటు లేని కాలాన్ని ఊహించుకుంటే అసలు కారణం స్పష్టమవుతుంది. అప్పట్లో ఇళ్లలో ట్యూబ్‌లైట్లు, బల్బులు లేవు. సూర్యుడు అస్తమించగానే ఆముదపు దీపం లేదా కొవ్వొత్తి వెలుగే ఆధారం. అలాంటి మసక వెలుతురులో గోళ్లు కత్తిరించుకోవడం అంటే గాయాల్ని ఆహ్వానించుకున్నట్టే.

ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సేఫ్టీ నెయిల్ కట్టర్లు అసలు లేవు. చిన్న కత్తులు, పదునైన కత్తెరలు లేదా బ్లేడ్లతోనే గోళ్లు తీయాల్సి వచ్చేది. చీకట్లో అవి జారితే వేళ్లకు గాయాలు కావడం సాధారణం. ఈరోజు చిన్న గాయం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ అప్పట్లో యాంటీసెప్టిక్ క్రీములు, యాంటీబయాటిక్స్ లేని రోజులు. చిన్న గాయమే పెద్ద ఇన్ఫెక్షన్‌గా మారే ప్రమాదం ఉండేది. అందుకే చీకటి పడ్డాక పదునైన వస్తువుల్ని వాడొద్దని పెద్దలు గట్టిగా చెప్పేవారు.

ఇంకో ముఖ్యమైన కారణం పరిశుభ్రత. కత్తిరించిన గోళ్లు మసక వెలుతురులో కింద పడితే కనిపించేవి కాదు. అప్పట్లో చాలామంది నేలమీదే కూర్చుని భోజనం చేసేవారు. ఆ గోళ్లు ఆహారంలో కలిసే ప్రమాదం ఉండేది. ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారేది. అందుకే గోళ్లు పగలు వెలుతురులోనే తీయాలన్న నియమం పెట్టారు. కానీ పిల్లలకు ఈ లాజిక్ మొత్తం వివరించడం కష్టం. అందుకే “చేయొద్దు” అనే మాటకు కొంచెం భయం కలిపి చెప్పారు. కాలక్రమేణా ఆ జాగ్రత్త ఒక సంప్రదాయంలా మారిపోయింది. అసలు కారణం మరిచిపోయి, లక్ష్మీదేవి పోతుంది అన్న మాటే మిగిలిపోయింది. కరెంటు వచ్చాక, టెక్నాలజీ పెరిగాక, వైద్యం మెరుగుపడ్డాక కూడా ఆ పాత నమ్మకం మాత్రం అలాగే కొనసాగింది.

ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే రాత్రిపూట గోళ్లు తీయడంలో శాస్త్రీయంగా ఎలాంటి తప్పూ లేదు. మన ఇళ్లలో మంచి లైటింగ్ ఉంది, సురక్షితమైన నెయిల్ కట్టర్లు ఉన్నాయి, శుభ్రత పాటించే అలవాట్లు ఉన్నాయి. కాబట్టి అది పూర్తిగా వ్యక్తిగత అలవాటు లేదా నమ్మకం మాత్రమే. మూఢనమ్మకమని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు, అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు భద్రత కోసం పుట్టిన నియమం, కాలంతో పాటు ఒక కథగా మిగిలిపోయిందన్నదే అసలు నిజం.