మన దేశంలో ఎక్కువగా పోటీ ఉన్న పరీక్షలలో నీట్ ఒకటి కాగా జేఈఈ తరహాలో నీట్ పరీక్షను సైతం రెండంచెలలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం అందుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఐఐటీలు, ఎన్.ఐ.టీలలో సీట్ల భర్తీ కోసం మొదట జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించిన వాళ్లను జేఈఈ అడ్వాన్స్డ్ కు అనుమతిస్తున్నారు.
మన దేశంలో ప్రతి సంవత్సరం నీట్ పరీక్ష కోసం ఏకంగా 18 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అందువల్ల ఈ విద్యార్థులలో వడబోత కోసం ఒక పరీక్షను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించిన వాళ్ల కోసం మరో పరీక్షను నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల తుది పరీక్షకు పరీక్ష కేంద్రాల సంఖ్యతో పాటు విద్యార్థుల సంఖ్య తగ్గనుంది.
మొదట పరీక్షను ఆన్ లైన్ విధానంలో తుది పరీక్షను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమయ్యే ముందు డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో ప్రశ్నాపత్రం పంపి వాటిని ప్రింట్లు తీసి పరీక్ష కేంద్రాలకు వచ్చిన విద్యార్థులకు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. పరీక్షల నిర్వహణ, డేటా భద్రత కోసం శాశ్వత ఉద్యోగులను నియమించనున్నారని తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించిన తుది నివేదికను సమర్పించనున్నారు. వచ్చే నీట్ లోనే కొన్ని సిఫారసులను అమలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. నీట్ పరీక్ష విషయంలో కొత్త నిబంధనల గురించి విద్యార్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.