ఈ ఊళ్ళో మహిళలు నైటీ వేసుకుంటే ఫైన్

పశ్చిమ గోదావరిజిల్లాలో కొత్త రూల్ తీసుకొచ్చారు ఒక గ్రామ పెద్దలు. మహిళలు, యువతులు వేసుకునే నైటీలపై నిషేధం విధించారు గ్రామ పంచాయతీ పెద్దలు. నైటీలు ధరించే ఆడవారికి జరిమానా విధిస్తామని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ధరించినవారిని చూసి సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్నీ ఊరంతా ప్రచారం కూడా చేయించారు. ఇంతకీ ఆ ఊరు పేరేమి? నైటీ నిషేధం కథా కమామిషి ఏమి? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవాల్సిందే…

పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు వేసుకునే నైటీలపై నిషేధం విధించారు గ్రామ పెద్దలు. ఎవరైనా పగలు నైటీలు ధరిస్తే 2000 జరిమానా ఉంటుందని, చూసి తెలిపిన వారికీ 1000 రూపాయల నగదు బహుమతి ఉంటుందని ప్రకటించారు. ఈ విషయంపై గ్రామమంతా చాటింపు కూడా వేయించారు. అయితే గ్రామ పెద్దలు స్వయంగా తీసుకున్న ఈ నిర్ణయం అధికారుల దృష్టికి వెళ్ళింది.

దీంతో గురువారం నిడమర్రు తహశీల్దారు ఎస్.సుందర్రాజు, ఎస్సై విజయకుమార్ గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. కాగా ఈ వ్యవహారంలో విశేషమేమంటే గ్రామస్థుల నిర్ణయంపై ఏ ఒక్కరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో పగటిపూట మహిళలు నైటీలు ధరించి రోడ్లపైకి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం 7 నుండి రాత్రి 7 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని వెల్లడించారు.