ఆ స్కీమ్స్ ప్రయోజనాలు పొందాలంటే వెంటనే చేరండి.. మార్చి 31 తర్వాత ఈ 9 స్కీమ్స్ ఉండవు.. ?

బ్యాంకులు తమ కస్టమర్ల కోసం అనేక పథకాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను కూడా అందిస్తున్నాయి. ఎస్‌బీఐ దగ్గరి నుంచి ఇండియన్ బ్యాంక్ వరకు దాదాపు అన్ని బ్యాంకులు ఇలా కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచాయి.అయితే బ్యాంకులు అందిస్తున్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కొంత కాలమే అందుబాటులో ఉంటాయి. మార్చి 31 తర్వాత కొన్ని బ్యాంకులు అందిస్తున్న ఎఫ్‌డీ స్కీమ్స్ అందుబాటులో ఉండవు. ఏఏ బ్యాంక్ ఎఫ్‌డీ స్కీమ్స్ అందుబాటులో ఉండవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కూడా 400 రోజుల టెన్యూర్‌తో అమృత్ కలశ్ పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరితే ఏకంగా 7.6 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అయితే ఈ పథకం మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీం ప్రయోజనాలు పొందాలంటే మార్చి 31 లోగా ఈ స్కీమ్ లో చేరాలి. అంతేకాకుండా ఉయ్ కేర్ ఎఫ్‌డీ పథకాన్ని కూడా ఎస్‌బీఐ అందిస్తోంది. ఇది కూడా మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇది 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీకి అదనం.

• అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పేరుతో ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో చేరిన వారికి 0.5 శాతం ఎక్కువ వడ్డీ కాకుండా, అదనంగా 0.25 శాతం అధిక వడ్డీ పొందొచ్చు. 2020 మే 18 నుంచి ప్రారంభమైన ఈ స్కీం వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండదు.

• ఐడీబీఐ బ్యాంక్ కూడా ఐడీబీఐ నామన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పేరుతో స్పెషల్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో చేరిన వారికి రెగ్యులర్ కస్టమర్ల కన్నా 0.75 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ ఈ నెలతో ముగుస్తుంది.

• ఇండియన్ బ్యాంక్ కూడా ఇండ్ శక్తి 555 డేస్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ వస్తుంది.ఈ స్కీమ్ లో రూ. 5 వేల నుంచి రూ.2 కోట్ల వరకు ఎంతైనా పొదుపు చేయవచ్చు.

• అలాగే పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కూడా పీఎస్‌బీ ఫ్యాబులస్ 300 డేస్, పీఎస్‌బీ ఫ్యాబులస్ ప్లస్ 601 డేస్, పీఎస్‌బీ ఇఅడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పీఎస్‌బీ ఉత్కర్ష్ 222 డేస్ అనే నాలుగు స్కీమ్ లు అందిస్తోంది. వీటిల్లో చేరితే 8.6 శాతం వరకు వడ్డీ వస్తుంది. అయితే ఈ స్కీమ్స్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.