తలలో చుండ్రు సమస్య అత్యంత ప్రమాదకరమైనది కానప్పటికీ తరచూ తలలో నుంచి తెల్లని పొట్టు వలె రాలుతూ చికాకు తెప్పించడమే కాకుండా నలుగురితో కలిసి సంతోషంగా గడపడానికి ఇబ్బందికరంగా మారుతుంది.ఒకసారి తలలోంచి చుండ్రు రాలటం మొదలైతే అనుక్షణం మిమ్మల్ని కలవరపెడుతూనే ఉంటుంది. అసలు చుండ్రు అంటే ఏమిటి సమస్య తలెత్తడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన చర్మ కణాలు ప్రతి మూడు లేదా నాలుగు వారాలకు ఒకసారి పాత చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.స్నానం చేసినప్పుడు పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోము.అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యలతో తల మీది కణాలు త్వరత్వరగా పాతబడిపోతూ, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. అక్కడ మృతకణాలు పేరుకుపోయి తెల్లటి పొట్టు మాదిరిగా ఊడివస్తుంటాయి. దీన్నే చుండ్రు అని అంటుంటాం. దీనివల్ల తలలో ఇన్ఫెక్షన్ ప్రారంభమై తీవ్రమైన దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చుండ్రు సమస్య తలెత్తడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన జీవన విధానంలో వస్తున్న మార్పులు ఆహారపు అలవాట్ల కారణంగా హార్మోల పనితీరులో వ్యత్యాసం ఏర్పడి నూనె గ్రంధులు అధికంగా సీబం అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ ద్రవాన్ని తల చర్మం మీదుండే ఒకరకం ఫంగస్ దీన్ని విడగొట్టి ‘ఓలియక్ ఆమ్లం’గా మారుస్తుంది. ఇది తలపై చర్మాన్ని చికాకు పరచటం వల్ల కొత్త కణాలు ఎక్కువెక్కువగా పుట్టుకొస్తాయి. మరోవైపు మృతకణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవన్నీ పేరుకొని, చుండ్రు మొదలవుతుంది. దురద కూడా ఆరంభమవుతుంది. చేతులతో గీరితే పొట్టు రాలి భుజాల మీద, దుస్తుల మీద పడి మనల్ని తీవ్ర అసహనానికి గురిచేస్తుంది.
చుండ్రు సమస్య నుంచి బయటపడడానికి రోజూ తల స్నానం చేయాలి. షాంపూతో తల స్నానం చేసే ముందు తల చర్మంపై కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. నూనెలో పావు చెంచా బేకింగ్ సోడా, కొన్ని నిమ్మరసం చుక్కలను కలిపి మర్దన చేసుకుంటే మంచిది. పది నిమిషాల సేపు అలాగే ఉండి యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనలో మానసిక ఒత్తిడిని తగ్గించే వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే మరీ మంచిది.