ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలివే.. మీ ఐడీపై పరాయి వారికి టికెట్లు బుక్‌ చేస్తే జైలుకేనా?

మనలో చాలామంది ఇతరుల ఐఆర్‌సీటీసీ ఐడీ మీద ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు బుక్ చేయించుకుంటూ ఉంటారు. అయితే బుక్ చేయించుకున్న వాళ్లకు ఎలాంటి సమస్య లేకపోయినా బుక్ చేసిన వాళ్లకు మాత్రం జైలు శిక్ష, భారీ జరిమానా ఖాయమని చెప్పవచ్చు. రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలు తీసుకొనిరాగా ఆ నిబంధనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్‌ పార్టీ పేరుపై రిజర్వేషన్‌ టిక్కెట్లు బుక్‌ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఇంటిపేరు ఉన్నవాళ్లు, రక్త సంబంధీకులకు మాత్రమే పర్సనల్ ఐడీపై రిజర్వేషన్ టికెట్లను బుకింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నిబంధనలను పాటించకపోతే రూ.10 వేల జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

రైల్వే శాఖ ఇతరులకు ఐఆర్‌సీటీసీ ఐడీ ఇవ్వవద్దని వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన వారు నెలకు 24 టికెట్లను బుక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఐడీ అటాచ్ చేయని వాళ్లు నెలకు 12 టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చేయడం ఇబ్బందులను కలిగిస్తుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.