మీ కూతురి పేరు మీద ఈ స్కీం లో పొదుపు చేస్తే రూ.63 లక్షలు పొందవచ్చు..?

ప్రస్తుత కాలంలో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలలో అమలులోకి తీసుకువచ్చాయి. ఈ పథకాల ద్వారా ఆడపిల్లలకు అవసరమైన ఉచిత విద్యా వైద్య సదుపాయాలు అందజేస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా భవిష్యత్తులో ఆడపిల్లల చదువు వివాహ ఖర్చులకోసం ఆర్థికంగా లబ్ది పొందవచ్చు. ఈ పథకంలో తల్లి దండ్రులు తమ కూతురు పేరు పేరు పై ప్రతి నెల కొంత మొత్తంలో పొదుపు చేయవచ్చు. ఈ స్కీం లో ఏడాదికి కనిష్టంగా రూ.250 చొప్పున పొదుపు చేయొచ్చు. ఇక గరిష్టంగా రూ.1,50,000 చొప్పున పొదుపు చేయొచ్చు.

పది సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరు పై ఈ పథకంలో డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు 21 ఏళ్లు పూర్తైన తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఓసారి సవరిస్తూ ఉంటుంది. ఈ పథకంలో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మరి ప్రతీ ఏటా ఎంత పొదుపు చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయో తెలుసుకొందాం.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా రూ.50,000 చొప్పున 15 ఏళ్లలో జమ చేస్తే మొత్తం రూ.7,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.13,71,718 వడ్డీ కలిపి మొత్తం రూ.21,21,718 రిటర్న్స్ వస్తాయి. ఇక ఈ పథకంలో ప్రతీ ఏటా రూ.75,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం పొదుపుకి రూ.11,25,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో అసలు వడ్డీ కలిపి రూ.31,82,577 రిటర్న్స్ వస్తాయి. ఇక ప్రతీ ఏటా రూ.1,00,000 చొప్పున జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి వడ్డీ కలిపి మొత్తం రూ.42,43,436 రిటర్న్స్ వస్తాయి. అలాగే ప్రతీ ఏటా రూ.1,50,000 చొప్పున జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి వడ్డీ తో కలిపి మొత్తం రూ.63,65,155 రిటర్న్స్ వస్తాయి.