ప్రస్తుత కాలంలో సరైన సమయంలో పెళ్లి కాకపోవడం వల్ల యువతలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల పెళ్లి సంబంధాలు కుదరకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది యువత పెళ్లి కుదరకపోవడం వల్ల భయాందోళనకు గురై పిచ్చిపిచ్చి పనులు చేస్తున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.
అయితే కొన్ని ఆలయాలను సందర్శించడం ద్వారా సులువుగానే పెళ్లి అవుతుంది. అలాంటి ఆలయాలలో ఇడగుంజి వినాయక స్వామి ఆలయం కూడా ఒకటి. వినాయకుడు బ్రహ్మచారే అయినప్పటికీ ఆయన దయ ఉంటే చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో ఈ వినాయకుని ఆలయం కూడా ఒకటి కావడం గమనార్హం.
ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉండగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి అని భక్తులు బలంగా విశ్వసిస్తారు. మూలవిరాట్టైన వినాయకుడు ఈ ఆలయంలో చూడముచ్చటగా ఉంటాడు. ఈ ఆలయంలో వినాయకుని దగ్గర ఎలుక వాహనం కనిపించదు. ఈ ఆలయంలో వినాయకుడికి గరికెను సమర్పిస్తే కోరిన కోరికలు తీరతాయి.
కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారని సమాచారం అందుతోంది. ఈ ఆలయంలో వినాయకుని పాదాల చెంత చీటీలు ఉంచి కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహం ఉందని ఇక్కడి భక్తులు భావిస్తారు. చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.