Mango: ఒక మామిడి చెట్టుకు నలుగురు వ్యక్తులు.. ఆరు కుక్కలు కాపలా..! ఏంటా కథ..

Mango: మామిడి పండ్ల సీజన్ వచ్చింది.. త్వరలో వెళ్లిపోతుంది కూడా. రకరకాల మామిడిపండ్లు మార్కెట్లో లభ్యమయ్యాయి. రసాలు, బంగినిపల్లి మాత్రమే కాకుండా.. ఆవకాయ, మాగాయ పచ్చళ్లకు కూడా మామిడి కాయలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటిని పండించే యజమానులు వారి తోటలకు కాపలా మనుషులను ఉంచుతారు. తోట చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే.. వీటిలో ఏ ఒక్క మామిడి చెట్టుకో ప్రత్యేక కాపలా అయితే.. ఏ యజమాని కూడా పెట్టడు. కానీ.. ఇలాటి విచిత్రం ఒకచోట జరిగింది. ఒకే మామిడి చెట్టు చుట్టూ నలుగురు వ్యక్తులు, ఆరు కుక్కలతో కాపాలా పెట్టాడో యజమాని. ఇందుకు కారణమేంటో.. తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఇలా ఒక మామిడి చెట్టుకు రక్షణగా ఉండి కాయలను కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. ఇంతకీ ఆచెట్టుకు పండే మామిడిపండ్ల సంఖ్య వింటే ఆశ్చర్యపోతాం కూడా. కేవలం ఏడంటే ఏడే మామిడిపండ్లు కాస్తాయి. వీటికే అంత భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ కాయల ప్రత్యేకత ఏంటంటే వీటి ధర ఒక కేజీ.. 2.70 లక్షలు. అవునా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే అంటున్నాడు మామిడి చెట్టు యజమాని పరిహార్. ఈ మామిడిపండ్లు జపాన్ కు చెందిన ‘మియజాకి’ అనే అరుదైన జాతి వంగడం. అనుకోకుండా పరిహార్ కు దక్కింది. జబల్ పూర్ కు చెందిన పరిహార్ ఓసారి చెన్నైకి రైలులో వెళ్తుంటే.. ఓ వ్యక్తి ఈ మొక్కను ఇచ్చాడు. అప్పుడు పరిహార్ ఈ మొక్క ప్రపచంలోనే ఎక్కువ ధర పలికే మామిడి మొక్క అని తెలీదు.

దీనిని నాటిన తర్వాత కాసిన తర్వాత ఓ వ్యాపారి తెలుసుకుని కేవలం ఒక్క కాయనే 21వేలు పెట్టి కొన్నాడు. దీంతో ఈ మామిడి వాల్యూ తెలిసింది పరిహార్ కు. గతేడాది ఇదే మొక్కకు కాసిన కాయలు దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఈ ఏడు గట్టి కాపలా పెట్టాడు. అవును మరి.. సాధారణంగా తెలంగాణలో కేజీ మామిడిపండ్లు 50 నుంచి 150.. ఆంధ్రాలో అయితే 12 కాయలు 200 నుంచి 300 ధరల్లో లభ్యమవుతాయి మరి వీటికి అనేక రెట్టింపు ధరలో మామిడి అంటే ఈమాత్రం సెక్యూరిటీ అవసరమే కదా..!