ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం పెద్ద దిక్కు ‘జియోనా చనా’ తన 76వ ఏట మృతి చెందారు. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లోని ట్రినిటీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరాంతంగ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి చనా పెద్ద తిక్కు. ఆయనకు 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు. మిజోరాం రాష్ట్రంతోపాటు.. చనా ఉండే గ్రామం బక్తంగ్ త్లంగ్నాంకు కూడా పర్యాటకలు ఎక్కువగా రావడానికి ఆయన కుటుంబం కూడా ఒక కారణం. ఇంతపెద్ద కుటుంబం.. ఇంతమంది సంతానానికి కారణమైన జియోనా మరణం బాధాకరం’ అని ట్వీట్ చేశారు.
జియోనా కొంతకాలంగా డయాబెటిస్ హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈనెల 7వ తేదీన పరిస్థితి తీవ్రమైంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జూన్ 11న కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు.