మన హిందూ సంస్కృతిలో సాముద్రిక శాస్త్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా ఆ వ్యక్తి భవిష్యత్తులో ఎటువంటి స్థాయిలో ఉంటాడన్న విషయం గురించి అంచనా వేయవచ్చు. శరీరంపై ఉండే పుట్టుమచ్చలు కొన్ని శుభానికి సంకేతం అయితే.. మరికొన్ని పుట్టుమచ్చలు ఆశుభానికి సంకేతంగా ఉంటాయి. శరీరం మీద పుట్టుమచ్చ ఉన్న ప్రదేశం.. దాని పరిమాణం బట్టి సాముద్రిక శాస్త్రంలో ఫలితాలను పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం.. కొన్ని చోట్ల ఉండే పుట్టుమచ్చలు వారికి అదృష్టాన్ని, సంపదకు కారణం అవుతాయి. మరి శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అరచేతిలో పుట్టుమచ్చ:
చాలామందికి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. అరి చేతిలో పుట్టుమచ్చ వున్నవారు ఎంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా జీవిస్తారు. అలాగే కష్ట సమయాలలో కూడా వీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. అయితే ఇలా అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారికి కొంచెం బద్ధకం ఎక్కువ. ఆ బద్దకం వల్ల కొన్ని సందర్భాలలో నష్టపోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆత్మగౌరవంతో జీవించాలని భావిస్తారు.
ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ :
సాముద్రికశాస్త్రం ప్రకారం.. ఉంగరపు వేలిపై పుట్టుమచ్చ ఉన్నవారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రజాదరణ కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ఆచరణాత్మకంగా, సామాజికంగా ఉంటారు. ఇలా ఉంగరపు వేలు మీద పుట్టుమచ్చ వున్నవారు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. అలాగే ఏ విషయమైనా కూడా ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు.
గడ్డం మీద పుట్టుమచ్చ :
సాముద్రికశాస్త్రం ప్రకారం.. గడ్డం మీద పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీరు డబ్బు సంపాదించడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు గ్రూమింగ్ పట్ల ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇటువంటి మహిళలు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
వీపుపై పుట్టుమచ్చ :
వీపుపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. వీరు చాలా సరదా స్వభావం కలిగి ఉంటారు. అంతే కాకుండా ఏ విషయంలోనైనా కూడా చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీంతో పాటు, ఈ వ్యక్తులు చిన్న వయస్సులో ధనవంతులు అవుతారు. తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.